పరీక్షా పత్రంలో ఆన్సర్లు కాకుండా జై శ్రీరామ్ నినాదాలు రాసిన విద్యార్థులను పాస్ చేయడం ప్రస్తుతం తీవ్ర వైరల్‌గా మారింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని జాన్‌పూర్‌లో ఉన్నా వీర్ బహదూర్ సింగ్ పుర్వాంచల్ యూనివర్సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. యూనివర్సిటీలోని విద్యార్థులు ఏది రాసినా అక్కడి ప్రొఫెసర్లు వారిని పాస్ చేయించారనే ఆరోపణలు రాగా.. సమాచార హక్కు చట్టం ద్వారా ఆ ఆన్సర్ షీట్లను తీసుకుని చూడగా అందులో జై శ్రీరామ్ అని రాసి ఉండటం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యూనివర్సిటీలో ఇటీవల నిర్వహించిన డీ ఫార్మసీ పరీక్షలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో చర్యలు చేపట్టిన అధికారులు.. ప్రొఫెసర్లను సస్పెండ్ చేశారు.
యూనివర్సిటీలోని ప్రొఫెసర్లు డబ్బులు తీసుకుని.. విద్యార్థులను పాస్ చేయించారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో యూనివర్సిటీ విద్యార్థి నేత దివ్యాంశు సింగ్ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు గవర్నర్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, వైస్ ఛాన్సలర్లకు లేఖలు రాశారు. అందులో కొందరు విద్యార్థులకు ఏకంగా 60 శాతం మార్కులు కూడా వేసినట్లు గుర్తించారు. ఆ ఆన్సర్ షీట్లలో జై శ్రీరామ్‌తోపాటు క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా వంటి వారి పేర్లను కూడా విద్యార్థులు రాశారు.
ఇక ఆ విద్యార్థుల ఆన్సర్ షీట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. వెంటనే స్పందించిన వీర్ బహదూర్ సింగ్ పుర్వాంచల్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ వందనా సింగ్.. కమిటీ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. కొందరు ప్రొఫెసర్లు విద్యార్థులకు ఎక్కువ మార్కులు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయని.. అందుకే ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే బుధవారం జరిగిన పరీక్షల కమిటీ సమావేశంలో ప్రొఫెసర్లు డాక్టర్ వినయ్ వర్మ, మనీష్ గుప్తాలను సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.