భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో.. చంద్రయాన్-3 ప్రయోగం ద్వారా అంతరిక్ష రంగ చరిత్రలో భారత్ పేరును సువర్ణ అక్షరాలతో లిఖించేలా చేసింది. ఈ ప్రయోగ సక్సెస్ కావడంతో చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయిన తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. ఇక అమెరికా, రష్యా, చైనాల తర్వాత జాబిల్లిని ముద్దాడిన నాలుగో దేశంగా నిలిచింది. చంద్రుడిపైనే అత్యంత కఠినమైన దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్‌ను ల్యాండ్ చేసి.. ఇస్రో అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఈ క్రమంలోనే తాజాగా చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించి సరికొత్త విషయం బయటికి వచ్చింది. చంద్రయాన్ 3 ప్రయోగాన్ని 4 సెకన్లు ఆలస్యంగా ల్యాండ్ చేయడం వల్ల కూలిపోయే ప్రమాదం నుంచి బయటపడేసినట్లు ఇస్రో వెల్లడించింది.
4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్-3 లోని విక్రమ్ ల్యాండర్‌ను జాబిల్లి ఉపరితలంపై దించడం వల్ల ప్రయోగాన్ని రక్షించుకోగలిగామని ఇస్రో తెలిపింది. విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ కావడానికి కొన్ని క్షణాల ముందు.. ఆ ప్రాంతంలో ఉన్న అంతరిక్ష వ్యర్థాల కారణంగా ప్రయోగం క్రాష్ అయ్యే ప్రమాదం ఉందని.. ల్యాండర్‌లో ఉన్న పరికరాలు గుర్తించి ఇస్రోకు పంపినట్లు తెలిపింది. ల్యాండర్‌లోని కీలకంగా ఉండే మొదటి ఆర్బిటల్ ప్రాంతం.. ఆ అంతరిక్ష వ్యర్థాలను తాకి పేలిపోయే ప్రమాదం ఉండేదని గుర్తించాయి. వెంటనే ల్యాండింగ్ సమయాని కంటే 4 సెకన్లు ఆలస్యంగా విక్రమ్ ల్యాండర్‌ను చంద్రుడిపై ల్యాండ్ చేసినట్లు తెలిపింది.
ఆ 4 సెకన్లు ఆలస్యం చేయడమే చంద్రయాన్-3 క్రాష్ ల్యాండింగ్ నుంచి కాపాడినట్లు స్పేస్ సిట్యుయేషనల్ అసెస్‌మెంట్ రిపోర్ట్ వెల్లడించింది. ఉపగ్రహాలను రక్షించడానికి.. ఢీకొట్టే ప్రమాదాలను నివారించేందుకు 23 రకాల విన్యాసాలను నిర్వహించినట్లు ఇస్రో తన తాజా నివేదికలో తెలిపింది. 2023 జూలై 14 వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి చంద్రయాన్ 3 ప్రయోగాన్ని నింగిలోకి పంపించారు. అది 40 రోజులపాటు ప్రయాణించి ఆగస్టు 23 వ తేదీ సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయింది. దీంతో జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.