సముద్రం పక్కనే ఉన్న ప్రాంతాలకు చాలా భయాలు ఉంటాయి. ఎప్పుడు సముద్రంలో ఏం తుపానులు, రాకాసి అలలు వస్తాయో తెలియక తీరప్రాంత వాసులు ఎప్పుడూ బిక్కుబిక్కుమంటూ బతుకుతూ ఉంటారు. ఏదైనా తుపాన్లు వచ్చినపుడు ఇల్లు, వాకిలి వదిలేసి క్యాంపుల్లోనే రోజుల తరబడి జీవించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం కేరళ, తమిళనాడు తీర ప్రాంతాలను ‘కల్లక్కడల్ ఫినామినా తీవ్రంగా భయపెడుతోంది. కేరళలోని మొత్తం తీర ప్రాంతాలు, తమిళనాడులోని దక్షిణ తీరప్రాంతాలకు ఈ కల్లక్కడల్ ఫినామినా భయం పట్టుకుంది. ఈ ప్రాంతాలన్నీ సోమవారం రాత్రి 11.30 గంటల వరకు ఈ కల్లక్కడల్ ఫినామినాను ఎదుర్కొనున్నాయి.
వాతావరణంలో ఏర్పడే దృగ్విషయాన్ని కల్లక్కడల్ ఫినామినా అంటారు. సముద్రాలు అకస్మాత్తుగా ఉప్పొంగి.. పెద్ద పెద్ద రాకాసి అలలు తీర ప్రాంతాన్ని ముంచెత్తడాన్ని కల్లక్కడల్ ఫినామినా అంటారు. ప్రస్తుతం కల్లక్కడల్ ఫినామినా కారణంగా కేరళ, తమిళనాడు తీరప్రాంత వాసులు, మత్స్యకారులు అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే కల్లక్కడల్ ఫినామినా కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున.. అధికారుల సూచనలతో డేంజర్ జోన్ ప్రాంతాలకు దూరంగా ఉండాలని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్-ఐఎన్‌సీఓఐఎస్ సూచించింది.
అంతేకాకుండా ఫిషింగ్ హార్బర్లలో ఫిషింగ్ ఓడలను సురక్షితంగా ఉంచాలని ఐఎన్‌సీఓఐఎస్ ప్రజలకు కీలక సూచనలు చేసింది. ఫిషింగ్ బోట్లను దూరంగా లంగరు వేసి ఉంచడం వల్ల అవి ఢీకొనకుండా ఉంటాయని తెలిపింది. ఫిషింగ్ బోట్లకు సంబంధించిన ఫిషింగ్ పరికరాలను భద్రంగా ఉండేలా చూసుకోవాలని ఐఎన్‌సీఓఐఎస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ కల్లక్కడల్ ఫినామినా హెచ్చరికలతో సముద్రంలోని బీచ్ వద్దకు ప్రజలు వెళ్లడాన్ని పూర్తిగా నివారించాలని హెచ్చరికలు చేసింది. హిందూ మహాసముద్రం దక్షిణ భాగంలో ఎలాంటి నిర్దిష్ట సూచనలు లేకుండా అకస్మాత్తుగా సంభవించే బలమైన గాలుల వల్ల ఈ కల్లక్కడల్ ఫినామినా ఏర్పడుతుందని తెలిపింది.