ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆక్వా రైతులని ఆదుకుంటాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 01, 2024, 06:33 PM

‘కొల్లేరు ప్రజల చిరకాల కోరిక కాంటూరును కుదిస్తాం. కొల్లేరు అభయారణ్యం పరిధిని ఐదో కాంటూరు నుంచి మూడో కాంటూరుకు కుదించేందుకు కేంద్రంతో మాట్లాడి పూర్తిచేస్తా’నని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  ప్రకటించారు. దెందులూరులో సోమవారం ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్‌యాదవ్‌, దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌లతో కలసి ప్రజాగళం రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఆక్వా రైతుల బాధలు తెలుసు. ఆక్వాకు రూపాయిన్నరకే విద్యుత్‌ను అందిస్తా. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీపై సంతకం చేస్తాను. ఐదేళ్లుగా రాయితీలు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. బిందుసేద్యానికి 90శాతం రాయితీపై పరికరాలు అందిస్తాం. పామాయిల్‌ పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే తండ్రీ, కొడుకులు వసూళ్లకు తెరలేపారు. పోలవరం కుడి కాల్వ గట్లను దోచేశారు. గట్టు కొట్టేయడంతో భవిష్యత్‌లో వరద ప్రమాదం పొంచి ఉంది. పోలవరం గట్లు కొట్టిన వారిని జైల్లో పెట్టినా తప్పు లేదు. దెందులూరును దందాల ఊరుగా మార్చేశారు. దాడులు, దౌర్జన్యాల సంస్కృతికి తెరలేపారు. ఎర్రిపప్ప తన కొడుకును ఎంపీ అభ్యర్థిగా పంపించాడు. ఓటర్లు ఆయనను ఎర్రిపప్పను చేసి పంపించండి. ఎంపీ, ఎమ్మెల్యేలతో పనులు చేయించే బాధ్యత నాది.. ఓట్లు వేసి గెలిపించే బాధ్యత మీది.. లండన్‌బాబు వచ్చాడు.. ఐటీ కంపెనీలు తెస్తాడని అంతా ఎదురు చూశారు.. కానీ ఒక్క కంపెనీ అయినా తెచ్చాడా..? పేకాట కంపెనీని మాత్రం తీసుకొచ్చాడు. మీ ఈలలు ఓట్లుగా మారాలి. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించు కుంటే ప్రజల సంక్షేమం సాధ్యపడుతుంది’ అంటూ చంద్రబాబు స్పష్టం చేశారు. చింతమనేని మాట్లాడుతూ తనను నమ్మి రెండుసార్లు గెలిపించిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునేందుకు మళ్లీ చంద్రబాబు నాకు అవకాశం కల్పించారని, మళ్లీ గెలిపించాలని కోరారు. నియోజక వర్గ్గంలో తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పోలవరం కాల్వ ద్వారా రెండు లిఫ్టులను ఏర్పాటు చేసి అందించాలన్నారు. ఏలూరు రూరల్‌ మండలంలో కృష్ణ కాల్వలో వస్తున్న మురుగు వ్యర్థాలను తాగునీరుగా అందిం చాల్సిన పరిస్థితి ఉందనడంతో స్పందించిన చంద్రబాబు మనం అధికారంలోకి రాగానే రెండు లిఫ్ట్‌లను మంజూరు చేస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa