ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నటనలో ఓనమాలు నేర్చుకుంది విశాఖలోనే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 03, 2024, 06:30 PM

విశాఖ ప్రజలను అనేక విధాలుగా మోసం చేసి, భూములు లాక్కున్న వైసీపీని బంగాళాఖాతంలో కలిపేయాలని పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి ఆయన నగరంలోని పూర్ణామార్కెట్‌ ప్రాంతంలో గల దుర్గాలమ్మ గుడి జంక్షన్‌లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. విశాఖలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి వాటాలు వేసుకొని మరీ భూములు ఆక్రమించారని, ఇప్పుడు కొత్తగా తెచ్చిన ల్యాండ్‌ టైటిల్‌ చట్టంతో వారు మరింత పెట్రేగిపోతారన్నారు. విశాఖలో సొంత ఎంపీ ఎంవీవీ కుటుంబానికే వైసీపీ ప్రభుత్వం భద్రత కల్పించలేకపోయిందని, ఇక ప్రజలకు ఎలా రక్షణ కల్పిస్తుందని ప్రశ్నించారు. విశాఖలో కాలుష్యం అధికంగా ఉందని, అటు సముద్ర కాలుష్యం, ఇటు పరిశ్రమల కాలుష్యం ఎక్కువైందని, వాటిపై నియంత్రణ మండలి, కలెక్టర్‌ చర్యలు తీసుకోవడం లేదని పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. జీతాలు తీసుకొని పనిచేయని అధికారులను చొక్కా పట్టుకొని ప్రశ్నించాలని సూచించారు. తాను విశాఖలోనే నటనలో ఓనమాలు దిద్దుకున్నానని, ఈ ప్రాంతం అంటే అభిమానమని చెప్పారు. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో బోట్లు కాలిపోయినప్పుడు ఒక్కొక్కరికి రూ.50 వేలు సాయం చేస్తే, ఆ డబ్బులు తీసుకోవద్దని బాధితులను వైసీపీ నాయకులు బెదిరించారని ఆరోపించారు. చేతనైతే సాయం చేయాలని కానీ ఇలా పేదలను కూడా బెదిరించడం వారికే చెల్లిందన్నారు. చీకటి పడితే మహిళలు ఒంటరిగా వెళ్లలేకపోతున్నారని, వారికి భద్రత లేదని చెప్పారు. కూటమి అధికారంలోకి వస్తే భద్రతకు, రక్షణకు, స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఎవరైనా ఆడపిల్లల జోలికి వెళ్లినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా మోకాళ్లు విరగ్గొట్టి జగదాంబ సెంటర్‌లో నిలబెడతామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa