ఏపీలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు సూర్యుడు దంచికొడుతుంటే .. మరోవైపు వరుణుడు చల్లబరుస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా భానుడి ప్రతాపం కొనసాగుతుంటే.. తిరుమలలో వెంకన్న సామి భక్తులు చల్లదనాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పగటి పూట ఉష్ణోగ్రతలు అర్ధసెంచరీకి చేరువగా వెళ్తున్నాయి. జనం భరించలేని ఉక్కబోత, వేడితో ఇబ్బందులు పడుతున్నారు. అయితే తిరుమలలో మాత్రం గత మూడురోజులుగా భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం వరకూ ఎండ.. మధ్యాహ్నం నుంచి వర్షం అనేలా తిరుమలలో పరిస్థితి ఉంది. శనివారం కూడా తిరుమలలో వడగండ్ల వాన కురిసింది. దీంతో అప్పటి వరకూ వేడి, ఉక్కబోతతో ఇబ్బందులు పడిన భక్తులు.. వర్షం కురవటంతో ఉపశమనం పొందారు.
అయితే తిరుమలలో వడగండ్ల వాన కురవడానికి ఓ కారణం ఉందంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. పగటి పూట భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో తిరుమలలో వేడి వాతావరణం ఏర్పడుతోంది. ఈ వేడి వాతావరణానికి చల్లని గాలులు కూడా తోడు కావటంతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయి. భూమి బాగా వేడెక్కి ఆ వేడి గాలి, తేమతో కలిసి బాగా ఎత్తుకువెళ్లినప్పుడు ఈ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇలా ఏర్పడిన మేఘాల్లోని తేమ వలన మంచుఫలకాలు ఏర్పడుతాయని.. మేఘాలు పరస్పరం ఢీకొన్న సమయంలో మంచుఫలకాలు చిన్న ముక్కలుగా వడగండ్ల రూపంలో కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతూ ఉండటమే ఈ వడగండ్ల వానకు కారణమంటున్నారు.
మరోవైపు ఏపీవ్యాప్తంగా ఎండలు ఉన్నప్పటికీ... తిరుమలలో ఆ వేడి వాతావరణానికి అటవీ ప్రాంతం నుంచి వీచే తేమతో కూడిన గాలులు కూడా కలవడంతో ఈ క్యుముులోనింబస్ మేఘాలు ఏర్పడతాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అందుకే వేసవిలో తిరుమలలో వడగండ్ల వాన కురుస్తోందని అంటున్నారు. అయితే ఈ వడగండ్ల వాన కారణంగా.. ఎండ వేడిమితో ఇబ్బందులు పడుతున్న భక్తులు మాత్రం ఉపశమనం పొందుతున్నారు. అటు వేసవి తాపం నుంచి భక్తులకు ఉపశమనం కల్గించేందుకు టీటీడీ సైతం అనేక చర్యలు తీసుకుంటోంది.