ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏపీ ఎన్నికలపైనా చర్చ నడుస్తోంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతున్నప్పటికీ .. తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రం ఏపీ ఎన్నికలపైనా ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఏపీలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ కూటమి ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే ఇందుకు కారణం. ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీకి మనుగడ కోసం పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని అన్ని పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. మరోవైపు ఏపీ ఎన్నికల గురించి పక్కరాష్ట్రాల నేతలు కూడా తమ అభిప్రాయాన్ని, అంచనాను వెల్లడిస్తున్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పటికే ఏపీలో ఎవరు గెలుస్తారనే దానిపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తాజాగా ఈ జాబితాలోకి తెలంగాణ బీజేపీ నేత వచ్చి చేరారు.
బీజేపీ ఎంపీ, తెలంగాణ బీజేపీ సీనియర్ నేత కె. లక్ష్మణ్ ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్జుందనే దానిపై జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ కూటమిదే విజయమని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. ఏపీ, తెలంగాణలో అవినీతి పార్టీల పాలనతో ప్రజలు విసిగిపోయారని.. అందుకే మార్పును కోరుకుంటున్నారని లక్ష్మణ్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన లక్ష్మణ్.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ బీసీలను బానిసలుగా చేసి పాలన సాగిస్తున్నారని లక్ష్మణ్ విమర్శించారు. మరోవైపు కేంద్రంలోనూ మోదీకి సరితూగే లీడర్ లేనే లేడన్న లక్ష్మణ్.. ఈ ఎన్నికల్లోనూ రాహుల్ గాంధీకి ఓటమి తప్పదంటూ జోస్యం చెప్పారు.
ఏపీలో మే 13వ తేదీ పోలింగ్ జరగనుంది. జూన్ నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. మరో నెల రోజుల్లో ఏపీవాసులను ఐదేళ్లపాటు పరిపాలించే పార్టీ ఏదనేదీ తేలిపోనుంది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఒంటరిపోరుకే మొగ్గుచూపగా.. టీడీపీ మాత్రం, బీజేపీ, జనసేనతో జట్టుకట్టింది. మూడు పార్టీలు కూటమిగా బరిలో నిలిచాయి. టీడీపీ 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ సీట్లలో పోటీచేస్తుండగా.. బీజేపీకి 10 ఎమ్మెల్యే, 6 ఎంపీ సీట్లు కేటాయించారు. ఇక జనసేన పార్టీకి 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లను పొత్తులో భాగంగా కేటాయించారు.