ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం అన్నాచెల్లెలి యుద్ధం నడుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా వైఎస్ఆర్ కుటుంబం రెండుగా విడిపోయి 2024 ఎన్నికల్లో తలపడుతోంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కడప సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఓ వైపు.. వైఎస్ జగన్ చెల్లెళ్లు వైఎస్ షర్మిల, సునీత మరోవైపు నిలబడి తలబడుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య మాటలు కూడా తూటాల లెక్కన పేలుతున్నాయి. తన చెల్లెలు షర్మిల పచ్చ చీర కట్టుకుని ప్రత్యర్థుల ఇళ్లకు వెళ్లి వారితో చేతులు కలిపిందంటూ వైఎస్ జగన్.. షర్మిలను ఉద్దేశించి నేరుగా విమర్శలు చేస్తున్నారు. అయితే బాబాయి వివేకాను చంపిన హంతకులకు జగన్ టికెట్ ఇచ్చారంటూ షర్మిల ఆరోపిస్తున్నారు, అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి మీదకు పోటీకి కూడా దిగారు షర్మిల. ఈ క్రమంలోనే ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షర్మిలకు డిపాజిట్లు కూడా దక్కవనే బాధ తనకు ఉందంటూ జగన్ వ్యాఖ్యానించారు.
తాజాగా చెల్లెలు వైఎస్ షర్మిలను ఉద్దేశించి వైఎస్ జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. టైమ్స్ నౌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షర్మిల గురించి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు, తన చెల్లెలు మధ్య ప్రస్తుతం ఉన్న సంబంధాలపై జగన్ మాట్లాడారు. వైఎస్ షర్మిలను మిస్ అవుతున్నారా అని జర్నలిస్టు ప్రశ్నించగా.. అవునని జగన్ సమాధానం ఇచ్చారు. ఎందుకు కాదు? తప్పకుండా మిస్ అవుతున్నా. దురదృష్టం కొద్దీ ఆమె వెళ్లిపోయింది. అయితే ఆమెను ఇప్పటికీ మిస్ అవుతూనే ఉన్నా. ఆమె వెళ్లిపోయినా.. ఆ ప్రేమలు ఎక్కడికి పోతాయి అని జగన్ బదులిచ్చారు. షర్మిలకు మంచి జరగాలని కోరుకుంటున్నారా అని ప్రశ్నించగా.. దురదృష్టవశాత్తూ ఆమె తీసుకున్న లైన్ కారణంగా పరిస్థితులు అంత మంచిగా లేవు అని జగన్ సమాధానమిచ్చారు.
ఇదే సమయంలో రాజకీయాల్లోకి రానివ్వనందుకే తన నుంచి షర్మిల, సునీత విడిపోయారనే విమర్శలకు కూడా జగన్ బదులిచ్చారు. వారిని పార్టీలోకి చేర్చుకుని ఉంటే అది కుటుంబ రాజకీయం అయ్యేదని జగన్ అభిప్రాయపడ్డారు. అలాగే వారసత్వ సమస్య కూడా లేదన్న జగన్.. తానింకా యువకుడినేనని అన్నారు. మరో 20 ఏళ్ల తర్వాత అలాంటి సమస్య రావచ్చేమోనని అన్నారు. అది కుటుంబంలోని సంబంధాలను నాశనం చేస్తుందనీ.. ఎవరైనా ఇంటికి వస్తే స్వేచ్చగా మాట్లాడుకునే పరిస్థితి రావాలి కానీ అన్ని చోట్లా రాజకీయాలు ఉండకూడదని జగన్ అభిప్రాయపడ్డారు.
అలాగే ప్రధానిగా రాహుల్ గాంధీ కంటే నరేంద్ర మోదీనే ఉత్తమమని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. మైనారిటీలు వంటి కొన్ని అంశాలను మినహాయిస్తే రాహుల్ గాంధీ కంటే నరేంద్ర మోదీయే ప్రధాని పదవికి సరైన వ్యక్తి అని జగన్ చెప్పారు. రాహుల్ గాంధీ అందరి కంటే గొప్పవారని ఎప్పటికీ చెప్పలేనని వైఎస్ జగన్ అన్నారు.