కాళ్లు, చేతులు సరిగా ఉన్న వాళ్లే కారు డ్రైవింగ్ నేర్చుకునేందుకు చాలా శ్రమ పడుతుంటారు. అలాంటిది.. చెన్నైకి చెందిన ఈ తాన్‌సేన్ అనే యువకుడు మాత్రం తనకు రెండు చేతులూ లేకున్నా.. కారు డ్రైవింగ్ చేస్తున్నాడు. కాళ్లను ఉపయోగించి కారు నడుపుతున్నాడు. ఒక కాలి పాదంతో స్టీరింగ్ ఆపరేట్ చేస్తాడు. మరో కాలితో యాక్సిలరేటర్, బ్రేక్ ఆపరేట్ చేస్తాడు. RTO నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కూడా సంపాదించాడు. తమిళనాడులో రెండు చేతులు లేకుండా.. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న తొలి వ్యక్తిగా తాన్‌సేన్ నిలిచాడు. అతడు 10 ఏళ్ల డ్రైవింగ్ లైసెన్స్ పొందాడు. కేరళకు చెందిన రెండు చేతులు లేని ఓ మహిళను చూసి తాను స్ఫూర్తి పొందానని కె. తాన్‌సేన్ చెబుతున్నాడు. తాన్‌సేన్‌కు నటుడు రాఘవ లారెన్స్ కూడా తోడ్పాటు అందించారు. ప్రత్యేక వైద్యుల బృందం అందించిన నివేదికను పరిశీలించిన అనంతరం రవాణా అధికారులు తాన్‌సేన్‌కు డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేశారు.
చేతులు ఎలా పోయాయి..?
సుమారు 20 ఏళ్ల కిందట తాన్‌సేన్ ప్రమాదవశాత్తూ హైటెన్షన్ వైర్లకు తగిలాడు. ఈ ప్రమాదంలో గాయపడిన తాన్‌సేన్‌కు వైద్యులు సర్జరీ చేసి.. రెండు చేతులనూ మోచేతుల వరకు తీసేశారు. అప్పుడు తాన్‌సేన్‌కు 10 ఏళ్లు. ప్రస్తుతం అతడి వయస్సు 30 ఏళ్లు.
పదేళ్ల వయసులోనే తమ కుమారుడు రెండు చేతులూ కోల్పోవడంతో తాన్‌సేన్ తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కానీ, క్రమంగా అతడు ధైర్యం తెచ్చుకున్నాడు. కాళ్ల సాయంతో సాధారణ పిల్లల మాదిరిగానే అన్ని పనులు చేయడం నేర్చుకున్నాడు. ఇప్పుడు ఎవరైనా గుర్తు చేస్తే గానీ.. తనకు రెండు చేతులూ లేవనే విషయం గుర్తుకురాదట. తాన్‌సేన్‌కు ఈతకొట్టడం, డ్రమ్స్ వాయించడం కూడా వచ్చు. అతడు న్యాయశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ నిర్వహించిన కచేరీలో తాన్సేన్ ప్రదర్శన ఇచ్చాడు. ఇప్పటివరకూ అనేక కచేరీల్లో ప్రదర్శన ఇచ్చినట్లు తాన్‌సేన్ తెలిపాడు.
‘కేరళలో ఒక మహిళ తనకు రెండు చేతులూ లేనప్పటికీ, డ్రైవింగ్ లైసెన్స్ పొందగలిగింది. ఆమె నుంచి నేను ప్రేరణ పొందాను. రెండు నెలల తర్వాత, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ మెడిసిన్‌లోని వైద్యులను సంప్రదించాను’ అని తాన్‌సేన్ చెప్పాడు. వైకల్యం ఉన్న వ్యక్తులు లైసెన్స్ పొందేందుకు వారి ఫిట్‌నెస్‌ను నిర్ధారిస్తూ తప్పనిసరిగా ఆసుపత్రి నుంచి ధృవీకరణ పొందాల్సి ఉంటుంది. మరి తాన్‌సేన్‌కు వెంటనే పని జరిగిందా?
తొలుత తిరస్కరించిన వైద్యులు
తాన్సేన్ ఆసుపత్రి ఆవరణలో కారును నడుపుతుండగా.. డైరెక్టర్ డాక్టర్ పి తిరునావుక్కరసుతో పాటు సీనియర్ వైద్యులు డాక్టర్ ఎ రాజకుమార్, డాక్టర్ చిత్రరసు క్రిష్ అతడి సామర్థ్యాలను పరిశీలించారు. అయితే, వైద్య బృందం కొన్ని సాంకేతిక అడ్డంకులను గుర్తించింది. ‘తాన్సేన్ తన మోచేతులతో స్టీరింగ్‌ను చేరుకోలేకపోయాడు. అతడికి సరైన పట్టు కూడా లేదు. ప్రొస్థెసెస్ కూడా ఉపయోగపడలేదు. అతడికి హ్యాండ్‌గ్రిప్, రీచ్ లేకపోవడంతో మేము అతడిని ధృవీకరించలేకపోయాము’ అని ఓ వైద్యాధికారి తెలిపారు.
ఆ ప్రశ్న ఆలోచింపజేసింది!
‘కాళ్లను ఉపయోగించి డ్రైవ్ చేయొచ్చా..?’ అని తాన్‌సేన్‌ను ప్రొఫెసర్ చిత్రరసు ప్రశ్నించాడు. ఈ ప్రశ్న అతడిని ఆలోచనలో పడేసింది. సరిగ్గా ఒక నెల తర్వాత అతడు తిరిగొచ్చాడు. ఈసారి వైద్యుల ముందు తన కాళ్లను ఉపయోగించి కారు డ్రైవింగ్ చేశాడు. ఈసారి పరీక్షలో విజయవంతంగా పాసయ్యాడు. వైద్యులు ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఇదే సమయంలో అతడి వాహనానికి కొన్ని మార్పులను సూచించారు. తాన్‌సేన్‌కు వైద్యులు గేర్‌లెస్ కారును రిఫర్ చేశారు. అతడి అవసరాలకు అనుగుణంగా కొన్ని మార్పులు సూచించారు. తాన్‌సేన్ తన కుడి పాదాన్ని స్టీరింగ్ కోసం, ఎడమ పాదాన్ని యాక్సిలరేషన్, బ్రేకింగ్ కోసం ఉపయోగిస్తాడు. వైపర్లు, హారన్, సూచికలు, లైట్ల కోసం అవసరమైన స్విచ్‌లను సైతం పాదాలతోనే ఆపరేట్ చేస్తాడు.
తాన్సేన్ చురుకుదనం, వేగం, ప్రతిచర్యను గమనించి డాక్టర్ అతుల్ వేద్‌తో కూడిన వైద్యుల బృందం RTO కోసం ఒక వివరణాత్మక నివేదికను రూపొందించింది. అతడు లైసెన్స్‌ను కలిగి ఉండేందుకు అర్హుడిగా ప్రకటించడంపై వివరణను ఇచ్చారు. ఆ తర్వాత అధికారులు అతడికి ‘ఎడాప్టెడ్ వెహికల్ కేటగిరీ’ కింద డ్రైవింగ్ చేయడానికి పదేళ్లకు గాను లైసెన్స్ ఇచ్చారు. తాన్‌సేన్ ఇప్పుడు తన సీటు బెల్ట్‌ను తనే బిగించుకొని, స్టీరింగ్ వీల్‌పై తన పాదాన్ని ఉంచి డ్రైవ్ చేసుకుంటూ వెళతాడు. ఈ ప్రయాణంలో తనకు సహకరించిన నటుడు రాఘవ లారెన్స్, శ్రీవారి శంకర్, డాక్లర్లకు అతడు ధన్యవాదాలు తెలిపాడు. ‘నా కారులో ఆటోమేటిక్ గేర్, బ్రేక్ సిస్టమ్‌లు ఉన్నాయి. సొంతంగా నడపడానికి ఇవి వీలు కల్పిస్తాయి. తిరుపతి కొండలకు నేనే స్వయంగా డ్రైవ్ చేశాను’ అని తాన్‌సేన్ గర్వంగా చెబుతున్నాడు. అతడి సంకల్పం, కృషి చాలా మందికి స్ఫూర్తి.