పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో కేంద్రం చేస్తున్న వ్యాఖ్యలను విమర్శించే క్రమంలో జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం, ఎన్సీ నేత ఫరూక్ అబ్దుల్లా తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ గాజులు తొడుక్కుని ఏం కూర్చోలేదని.. పీఓకేను స్వాధీనం చేసుకుంటే తీవ్ర పరిణామాలకు దిగుతుందని హెచ్చరించారు. అంతేకాకుండా పాక్ వద్ద అణ్వాయుధాలు కూడా ఉన్నాయని.. వాటిని భారత్‌పై వేసే అవకాశాలు ఉన్నాయని ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్‌లో కలిపేస్తామని ఇటీవల రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. అంతకుముందు విదేశాంగమంత్రి జై శంకర్ సహా పలువురు నేతలు చెప్పడం తెలిసిందే. బీజేపీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఫరూక్ అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు.
పీఓకేను భారత్‌లో కలిపేస్తామని ఇటీవల రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. పాక్ ఏమీ గాజులు తొడుక్కొని కూర్చోలేదని.. ఆ దేశం వద్ద అణుబాంబులు ఉన్నాయనే విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. పీఓకేను స్వాధీనం చేసుకుంటే అవి మన మీద పడుతాయని గుర్తుంచుకోవాలని తెలిపారు. రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టిన ఫరూక్ అబ్దుల్లా.. పీఓకేను స్వాధీనం చేసుకోకుండా అసలు ఆయనను ఎవరు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.
ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో నిర్వహించిన ఓ ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగించిన కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్.. భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధిని పరిగణనలోకి తీసుకుంటే పీఓకే ప్రజలు.. తాము భారత్‌లో విలీనం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాబట్టి పీఓకేను బలవంతంగా భారత్‌లో కలపాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే పీఓకే భారత్‌దేనని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి వేర్పాటువాదం, రాళ్ల దాడి ఘటనలు జరగలేదని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ప్రస్తుతం కాశ్మీర్ ప్రశాంతంగా ఉందని.. అందుకే తమను కూడా కాశ్మీర్‌లో భాగం చేయాలని పీఓకే ప్రజలే కోరుతారని పేర్కొన్నారు.