ఏపీలో మరో వారం రోజుల్లో ఎన్నికల జరగనున్నాయి. పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మచిలీపట్నంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటించారు. మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన వైఎస్ జగన్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ ఎన్నికలు బాగా జరుగుతాయనే నమ్మకం రోజురోజుకూ సన్నగిల్లుతోందని జగన్ వ్యాఖ్యానించారు. అమల్లో ఉన్న సంక్షేమ పథకాల నిధులను అడ్డుకుంటున్నారని.. ఇష్టానుసారంగా అధికారులను బదిలీ చేస్తున్నారని అన్నారు. అలాగే కూటమి నేతలు తనపై కుట్రలు చేస్తున్నారన్న వైఎస్ జగన్.. ప్రజలకు మంచి చేసే తనను ఉండకుండా చేయాలనేదే వాళ్ల లక్ష్యమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు,
విశాఖపట్నంలోని ఓ ఆక్వా కంటైనర్లో డ్రగ్స్ తీసుకొచ్చారని ప్రచారం చేశారన్న జగన్..తీరా చూస్తే కంటైనర్ బుక్ చేసింది చంద్రబాబు వదినమ్మ బంధువులని అరోపించారు. ఇల ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి విపక్షాలు ఫేక్ ప్రచారం చేస్తున్నాయన్న జగన్.. అబద్ధాలు చెప్తున్న వారిని అడుగుతున్నా.. మీలో ఎవడికైనా యాక్ట్ గురించి తెలుసా అంటూ ప్రశ్నించారు. రైతులు, యజమానులకు వారి భూములపై సర్వహక్కులు కల్పించేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చినట్లు చెప్పుకొచ్చారు. భూముల మీద ఎలాంటి వివాదాలు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ చట్టం తెచ్చామన్నారు వైఎస్ జగన్ . ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి రావాలంటే 17 వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తికావాలని.. ప్రస్తుతం ఆరువేల గ్రామాల్లో భూసర్వే పూర్తిచేసినట్లు చెప్పారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అసెంబ్లీ సాక్షిగా టీడీపీ నేతలు ప్రశంసలు కురిపించారన్న వైఎస్ జగన్.. వారి మీడియాలను కథనాలు ప్రసారం చేశారని చెప్పారు. అయితే ఎన్నికలు వచ్చేసరికి ఈ వీడియోలను యూట్యూబ్ నుంచి తొలగించారని చెప్పారు. అమల్లో ఉన్న ప్రభుత్వ పథకాల లబ్ధిని సైతం పేదలకు అందకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమల్లో ఉన్న సంక్షేమ పథకాలు అన్నీ ఆగిపోతాయని ఆరోపించారు. అందుకే ఏపీ ప్రజలు ఆలోచించి ఓటేయాలని జగన్ అన్నారు.