సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా.. ఆపదలో ఉన్నవారు కనిపిస్తే వెంటనే వారి వివరాలు తెలుసుకుని సాయం చేస్తూ ఉంటారు. ఇలా ఇప్పటివరకు సోషల్ మీడియాలో తన కంట పడ్డ వారిని చేరదీశారు. అయితే తాజాగా ఓ 10 ఏళ్ల కుర్రాడు.. ఆనంద్ మహీంద్రాను చాలా ఆకర్షించాడు. పుట్టెడు బాధలు ఉన్నా నవ్వుతూ ఉన్న ఆ బాలుడు.. ఇంటి పెద్ద తానే అయ్యాడు. ఓ వైపు చదువుకుంటూనే.. తన అక్క బాగోగులు కూడా చూసుకుంటున్నాడు. తండ్రి చనిపోయినా, తల్లి వదిలేసి వెళ్లినా.. పదేళ్లకే కుటుంబ బాధ్యతలు మోస్తున్నాడు. ఇంటిని నడిపేందుకు రోడ్డు పక్కన బండి పెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్నాడు. ఆ బాలుడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది చూసిన ఆనంద్ మహీంద్రా ఆ బాలుడిపై ప్రశంసల జల్లు కురిపించారు.
ఆ బాలుడికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. అతడి పేరు జస్ప్రీత్ అని పేర్కొన్నారు. ఢిల్లీకి చెందిన జస్ప్రీత్.. రాత్రిపూట రోడ్డు పక్కన ఫుడ్ బండి పెట్టుకుని సంపాదిస్తూనే.. ఉదయం పూట బడికి వెళ్లి చదువుకుంటున్నాడు. జస్ప్రీత్ తండ్రి అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు పిల్లలను చూసుకోవడం తన వల్ల కాదు అంటూ అతని తండ్రి.. వారిని విడిచి వెళ్లిపోయింది. దీంతో వారిద్దరూ అనాథలయ్యారు. అయినా జస్ప్రీత్ భయపడకుండా పదేళ్ల వయసులోనే.. తనతోపాటు అక్క బాధ్యతలను భుజాన మోస్తున్నాడు. ఈ విషయాలన్నింటినీ కొందరు వ్యక్తులు అడగ్గా.. జస్ప్రీత్ ఆ వీడియోలో వెల్లడించాడు.
ఈ వీడియోను షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్రా.. జస్ప్రీత్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. ఈ ధైర్యవంతుడి పేరు జస్ప్రీత్ అని.. తనకు ఉన్న బాధ్యతల కారణంగా అతని చదువుకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని.. ఆ బాలుడికి కావాల్సిన సాయం చేస్తామని తెలిపారు. జస్ప్రీత్‌ను చదివించేందుకు మహీంద్రా ఫౌండేషన్ పనిచేస్తుందని తెలిపిన ఆనంద్ మహీంద్రా.. జస్ప్రీత్ వివరాలు తెలిస్తే దయచేసి తనకు తెలియజేయాలంటూ నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు.
ఇక ఆనంద్ మహీంద్రా చేసిన పోస్టుకు స్పందించిన నెటిజన్లు.. ఆనంద్ మహీంద్రా తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలుడి చదువుకు సహాయం చేస్తామని ప్రకటించడం సంతోషకరం అని పేర్కొన్నారు. ఇక జస్ప్రీత్‌పైనా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. పదేళ్ల వయసులోనే చదువుతోపాటు బాధ్యతలు చూసుకుంటున్నందుకు హ్యాట్సాఫ్ అంటూ కొనియాడుతున్నారు. జస్ప్రీత్ తీసుకున్న నిర్ణయం ఎంతోమందిలో స్ఫూర్తిని నింపుతోందని చెబుతున్నారు. అంత కష్టపడుతున్న జస్ప్రీత్ జీవితంలో ఎంతో ఉన్నతస్థాయిలో నిలుస్తాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.