ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీకి విషయం అర్థమైంది.. పోలీసులకే రక్షణ లేకుండా పోయింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 13, 2024, 04:55 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ సరళిపై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఇవాళ పోలింగ్‌లో వైఎస్సార్‌సీపీ హింస వరకు వెళ్లిందని.. పోలీసులకు కనీసం రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఏకంగా ఎస్పీ వాహనంపై దాడి చేయడం.. టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డిపై దాడి చేయడం దారుణమన్నారు. ఇదంతా వైఎస్సార్‌సీపీ రాజకీయాలకు పరాకాష్ట అని.. జగన్ ఐదేళ్లుగా పెంచి పోషించిన రౌడీ మూకలు.. ఇవాళ తమ దాడుల ద్వారా ప్రజల్లో భయం పుట్టించి పోలింగ్ శాతాన్ని తగ్గించడం ద్వారా లబ్ధి పొందే కుట్ర చేస్తున్నారన్నారు. ప్రజలు ఈ కుట్రను తిప్పికొట్టాలన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటేయాలన్నారు. అత్యధిక ఓటు శాతంతో వైఎస్సార్‌సీపీ హింసా రాజకీయానికి ముగింపు పలకాలన్నారు.


'మండుటెండలను కూడా లెక్కచేయకుండా తెల్లవారు జాము నుండే ఓటింగులో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున క్యూలైన్‌లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు అద్దం పడుతుంది. కొన్నిచోట్ల వైఎస్సార్‌సీపీ నేతలు అడ్డంకులు సృష్టించినా లెక్కచేయకుండా ప్రజలు నిర్భయంగా ఓటింగులో పాల్గొంటున్నారు. ప్రజా స్పందనను చూసి ఓటమి భయంతో మాచర్ల, రైల్వేకోడూరు, పుంగనూరు వంటి చోట్ల దాడులకు పాల్పడ్డారు. వేలిపై సిరా చుక్క పడాల్సిన చోట రక్తపు చుక్కలు పడేలా చేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలపై ఎన్నికల కమిషన్ తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి' అని డిమాండ్ చేశారు.


'తెనాలిలో క్యూలైన్‌లో రమ్మని చెప్పినందుకు ఓటరుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ దాడి చేయడం దుర్మార్గం. దాడులు, దౌర్జన్యాలలతో ప్రజాభిప్రాయాన్ని మార్చలేరు. వైసీపీ నేతలు ఇటువంటి కుట్రలు చేస్తారనే ఉద్దేశంతోనే ప్రజలంతా ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకోవాలని నేను పిలుపునిచ్చాను. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వైఎస్సార్‌సీపీ వ్యతిరేక పవనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓటమి ఖాయమని నిర్ధారణవ్వడంతో ఎక్కడికక్కడ అల్లర్లకు తెగబడుతున్నారు. ఐదేళ్ల దౌర్జన్యకాండను ఎన్నికల వేళ కూడా కొనసాగిస్తూ దాడులకు, హత్యలకు పాల్పడడం వైసీపీ నేతలు ముందస్తుగా ఓటమి ఒప్పుకోవడమే' అన్నారు.


'పోలింగ్ కేంద్రాల్లో గొడవలకు దిగుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా విజ్నులైన ఓటర్లు సంయమనంతో వ్యవహరిస్తుండడం అభినందనీయం. పుంగనూరు, మాచర్ల, రైల్వేకోడూరు, మైదుకూరు, ఆముదాలవలస, తాడికొండలో ఎన్టీయే కూటమి ఏజెంట్లపై దాడులకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. తక్కెళ్లపాడు పోలింగ్ స్టేషన్ వద్ద ఎస్సీ మహిళలపైకి ఎంపీ అభ్యర్ధి కిలారు రోశయ్య కారుతో దూసుకు రావడం దుర్మార్గం. ఈ ఘటనల్లో బాధ్యులపై ఎన్నికల కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. పోలింగ్ ప్రారంభమైనప్పటికీ జగన్ రెడ్డి పేరుతో ఇంకా ఓటర్లకు IVRS కాల్స్ వస్తున్నట్లు పలు చోట్ల నుండి ఫిర్యాదులు అందాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి వస్తున్న కాల్స్ పై కూడా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి' అని డిమాండ్ చేశారు.


'యర్రగొండపాలెంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలపై, నరసరాపేటలో ఎంపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు, మాచర్ల అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి వాహనాలపై దాడి చేసిన వారిపై, తాడిపత్రిలో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్న పెద్దారెడ్డిపై, ఆయన కుమారుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఆముదాలవలసలో తమ్మినేని సీతారం సతీమణి రిగ్గింగ్‌కు పాల్పడటం అత్యంత హేయం. పోలింగు ప్రక్రియకు అంతరాయం కలిగిస్తూ, ఓటు హక్కును హరిస్తున్న వారిపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలి. వైసీపీ నేతల కుట్రల పట్ల టీడీపీ శ్రేణులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. శాంతియుతంగా ఎన్నికలు జరిగేందుకు ప్రజలంతా సహకరించాలి' అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa