ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు పడతాయంటోంది వాతావరణశాఖ. ఇవాళ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి.. అటు కోస్తాలోని కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని చెబుతున్నారు. సోమవారం సాయంత్రం 6 గంటల నాటికి అల్లూరి సీతరామరాజు జిల్లా పాడేరులో 57.5మిమీ, ప్రకాశం జిల్లా కనిగిరిలో 52.5మిమీ, శ్రీసత్యసాయి జిల్లా సోమండేపల్లిలో 46.5మిమీ, బాపట్ల జిల్లా అద్దంకిలో 38.5మిమీ, ప్రకాశం చంద్రశేఖరపురంలో 38మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది. దాదాపు 27 ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం పడినట్లు తెలిపారు.
మరోవైపు ఆంధప్రదేశ్ ప్రజలకు వాతావరణశాఖ మరో చల్లని కబురు చెప్పింది. ఉక్కపోత, వడగాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్న వేళ మంచి శుభవార్త అందించింది.ఈ ఏడాది కాస్త ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు. దక్షిణ అండమాన్ సముద్రం.. ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి ఈనెల 19నాటికి రుతుపవనాలు ప్రవేశిస్తాయని చెబుతున్నారు. ఈ ద్రోణి కారణంగా రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలకు అవకాశం ఉందంటున్నారు. ఈ వర్షాల కారణంగా ప్రజలకు ఎండలు, వేడిగాలుల నుంచి ఉపశమనం దొరికిందనే చెప్పాలి.అయితే సోమవారం ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో అత్యధికంగా 41.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు.