ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షించింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పిఠాపురంలో భారీగా పోలింగ్ నమోదు కావడంతో పవన్ కళ్యాణ్ గెలుపుపై జనసైనికులు ధీమాతో ఉన్నారు. అయితే సోషల్ మీడియా వేదికగా పిఠాపురం టీడీపీ నేతల, మాజీ ఎమ్మెల్యే వర్మను జనసేన పార్టీ కార్యకర్తలు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.. దీనికి కారణం లేకపోలేదు. ఇవాళ వర్మ పుట్టిన రోజు.. ఈ సందర్భంగా జనసైనికులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
వర్మపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు జనసేన పార్టీ కార్యకర్తలు. పుట్టిన రోజు విషెస్ చెబుతూనే.. 'మీ త్యాగం కష్టం గుర్తు పెట్టుకుంటాం వర్మ గారు.. పుట్టిన రోజు శుభాకాంక్షలు' అంటూ పలువురు ట్వీట్ చేశారు. 'మీరు ఇచ్చిన మద్దతును మర్చిపోలేము.. గొప్ప లీడర్ అంటూ ప్రశంసిస్తున్నారు. అంతేకాదు ట్విట్టర్‌లో కూడా వర్మగారు హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. జనసైనికులు ఇలా వర్మకు పుట్టిన రోజు సందర్భంగా సర్‌ప్రైజ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో తెలుగు దేశం పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువగా వర్మకు జనసైనికులు విషెస్ చెబుతున్నారు.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడంపై కొంతకాలం సస్పెన్స్ కొనసాగింది. ఈసారి ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేస్తారనే అంశంపై పవన్ క్లారిటీకి రాలేకపోయారు. పిఠాపురంతో పాటుగా మళ్లీ గాజువాకలో పోటీ చేస్తారా.. భీమవరం వెళ్తారా.. కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్ నియోజకవర్గాల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. మార్చి నెలలో పవన్ స్వయంగా పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. దీంతో జనసైనికుల్లో జోష్ పెరిగింది.. వర్మ కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే తాను మద్దతిస్తానని ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయడంపై అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత.. అక్కడ మాజీ ఎమ్మెల్యే వర్మ అనుచరులు వ్యతిరేకించారు. ఏకంగా టీడీపీ జెండాలు, పాంప్లేట్లు తగులబెట్టడంతో హైటెన్షన్ వాతావరణం కనిపించింది. వర్మ మరోసారి ఇండిపెండెంట్‌గా పోటీకి దిగుతారనే చర్చ కూడా జరిగింది. అయితే వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగి వర్మను పిలిచి మాట్లాడారు.. పిఠాపురంలో పవన్ పోటీకి సహకరించాలని కోరారు. అంతేకాదు మరో అడుగు ముందుకేసి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ప్రకటించారు. దీంతో వర్మ కూడా మెత్తబడ్డారు.. పవన్‌కు సహకరిస్తానని హామీ ఇచ్చారు.
ఏప్రిల్ నెల నుంచి వర్మ పవన్ కళ్యాణ్‌తో కలిసి పిఠాపురంలో ప్రచారం మొదలుపెట్టారు. వీరికి తోడు సీని ప్రముఖులు కూడా పిఠాపురంలో ప్రచారం చేశారు.. మెగా బ్రదర్ నాగబాబు, వర్మలు అక్కడే ఉండి అన్ని చూసుకున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ప్రచారంలో బిజీగా ఉన్నారు. వర్మ జనసైనికులతో కలిసి పవన్ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు.. అన్నీ తానై నడిచారు.దీంతో జనసైనికులు వర్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు.