ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోలింగ్ ముగిసింది.. అయినా సరే హింసాత్మక ఘటనలు మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో మంగళవారం కూడా టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్య ఘర్షణలుజరిగాయి. ఈ క్రమంలో ఎన్నికల సంఘం, పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పల్నాడు జిల్లా 144 సెక్షన్ అమలుకు ఆదేశించారు. నరసరావుపేట లోక్‌సభ స్థానంతో పాటుగా నరసరావుపేట, మాచర్ల, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల నియోజకవర్గాల్లో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి ఆంక్షలు అమల్లోకి రాగా.. తదుపరి ఆదేశాల వచ్చే వరకు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో ముగ్గురికి మించి ఎక్కువ మంది గుమికూడొద్దని సూచించారు.. అలాగే సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. ఎవరూ అనుమానాస్పదంగా సంచరించకూడదని హెచ్చరించారు పోలీసులు.
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో సోమవారం పోలింగ్ సమయంలో హింసాత్మక ఘటనలుజరిగాయి. ఈ క్రమంలో మంగళవారం కూడా ఆ హీట్ కొనసాగింది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. కారంపూడి మండలం పేటసన్నెగండ్ల పంచాయితీ పరిధిలో ఉన్న పోతురాజులగుట్టకు వెళుతున్నారు. పోలింగ్ రోజు జరిగిన ఘర్షణలో గాయపడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్ని పరామర్శించేందుకు బయల్దేరారు. కారంపూడి మీదుగా వెళ్తున్న సమయంలో.. పిన్నెల్లి కాన్వాయ్‌లోని ఓ కారుపై గుర్తుతెలియని వ్యక్తి రాయి విసిరాడని పిన్నెల్లి వర్గం రెచ్చిపోయింది.
కారంపూడిలో ఉన్న తెలుగు దేశం పార్టీ కార్యాలయం వైపు పిన్నెల్లి కాన్వాయ్ వెళ్లింది. అక్కడ వైఎస్సార్‌సీపీ వర్గీయులు కారులో నుంచి కర్రలు, ఇనుప రాడ్లు, కత్తుల్ని బయటకు తీశారు. టీడీపీ కార్యాలయం తలుపులు ధ్వంసం చేసి టీడీపీ కార్యాలయం లోపలికి వెళ్లారు.. అక్కడ ఫర్నీచర్ ధ్వంసం చేశారు.. కొందరు రాళ్లు రువ్వారు. అటు వైపుగా వెళ్తున్న టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారు.. ఓ కారుకు నిప్పు అంటించారు. కొందరు ఆ చుట్టుపక్కల ఉన్న షాపులపైనా దాడి చేశారు. తోపుడు బండి చిరు వ్యాపారులపైనా దాడికి తెగబడ్డారు. దీంతో కొద్దిసేపు కారంపూడి వణికిపోయింది.
మరోవైపు టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతో ఆ పార్టీ వర్గీయులు కూడా రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి చేసి వారి బైక్‌లకు నిప్పు పెట్టారు. కారంపూడిలో పరిస్థితి చేయి దాటడంతో ఎస్పీ బిందుమాధవ్ కారంపూడికి స్వయంగా వెళ్లారు. అవసరమైన చోట అదనపు బలగాలను మోహరించారు.. అక్కడ రెండు వర్గాలను చెదరగొట్టారు. ఇప్పుడు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మరోవైపు తిరుపతిలో కూడా పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.. అదనపు బలగాలను మోహరించారు. తాడిపత్రిలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల సంఘం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.