వైఎస్సార్‌సీపీ కీలక నిర్ణయం తీసుకుంది.. పార్టీ నుంచి కీలకమైన నేతను సస్పెండ్ చేసింది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన ఎంఆర్‌సీ రెడ్డి.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు విచారణ జరిపి క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు సస్పెండ్ చేసినట్లు తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో చర్యలు తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఎంఆర్‌సీ రెడ్డి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా ఉన్నారు.
పోలింగ్ రోజు వరకు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న ఎంఆర్‌సీ రెడ్డి ఆ తర్వాత ఎక్కడా పోస్ట్‌లు షేర్ చేయలేదు. అయితే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి కారణాలు తెలియాల్సి ఉంది. చంద్రగిరిలో పోలింగ్ రోజు, ఆ తర్వాత ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్శిటీలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి ఘటన కలకలంరేపింది. ఈ కేసులో పలువురు వైఎస్సార్‌సీపీ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో ఎంఆర్‌సీ రెడ్డి సస్పెన్షన్ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు ఎంఆర్‌సీ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుచరుడిగా ఉన్నారు.