బెంగళూరు నగర శివారులోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ పార్టీలో పలువురు సెలబ్రిటీలు పట్టుబడినట్టు బెంగళూరు పోలీసులు వెల్లడించారు. కానీ, వారు ఎవరనేది మాత్రం ఇంత వరకూ బయటకు రాలేదు. ఈ కేసులో ఐదుగురిని నిందితులుగా చేర్చినట్టు తెలిపారు. తాజాగా, రేవ్ పార్టీలో కీలక సూత్రధారిగా విజయవాడకు చెందిన లంకపల్లి వాసును గుర్తించారు. వన్‌టౌన్ ఏరియాలోని కొత్తపేట ఆంజనేయవాగుకు చెందిన వాసుకు వియవాడలోనూ పెద్ద నెట్‌వర్క్ ఉన్నట్టు తెలుస్తోంది. వ్యాపారం, ఫార్మా రంగాల పేర్ల మాటున వాసు చీకటి దందాలు చేస్తున్నట్టు పోలీసులు భావిస్తున్నారు.
బెట్టింగ్‌లతో పాటు డ్రగ్స్ సరఫరాలోనూ అతడ్్ని కీలక సూత్రధారిగా అనుమానిస్తున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్లలో ఏపీ పోలీసుల నంబర్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఫామ్‌హౌస్‌లో ఆదివారం రాత్రి బర్త్ డే వేడుకల పేరుతో నిర్వహించిన ఈ రేవ్ పార్టీకి సుమారు 150 మంది వరకు హాజరయ్యారు. తెల్లవార్లూ నాన్ స్టాప్‌గా పార్టీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ పార్టీలో మద్యంతో పాటు భారీ ఎత్తున డ్రగ్స్ వినియోగించినట్లు పోలీసులు తెలిపారు.
ఇప్పటికే సిద్దిఖి, రణదీర్, రాజ్‌భవ్‌లను డ్రగ్స్ పెడ్లర్లుగా ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేయడంతో రేవ్ పార్టీ గుట్టురట్టయ్యింది. తెలుగు సీనీ పరిశ్రమకు చెందిన వారు, కన్నడ సీరియల్ నటులతోపాటు 20 మందికిపైగా మోడల్స్ పార్టీలో పాల్గొన్నట్లు సమాచారం. ఈ పార్టీలో పాల్గొన్న 100 మంది 30 మంది యువతులు, 70 మంది యువకులు ఏపీ, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు విమానంలో వెళ్లినట్టు భోగట్టా.
పార్టీకి హాజరైనవారంతా డ్రగ్స్ తీసుకున్నారా? అనేది తేల్చడానికి వారి నుంచి రక్త నమూనాలు సేకరించారు. వాటిని ల్యాబ్‌కు పంపించామని పోలీస్ అధికారి తెలిపారు. అదుపులోకి తీసుకున్న 101 మందిలో ఐదుగురు మినహా మిగతావాళ్లను స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశామని, పిలిస్తే విచారణకు హాజరు కావాలని సూచించామని కమిషనర్ చెప్పారు. ‘సన్ సెట్-సన్ రైజ్ విక్టరీ’ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించి.. మద్యంతో పాటు భారీ ఎత్తున డ్రగ్స్ సరఫరా చేసినట్టు తెలిసింది. పోలీసుల రాకతో పలువురు తమ వద్ద ఉన్న డ్రగ్స్‌ను టాయ్‌లెట్‌తో గొడపై నుంచి బయటకు విసిరేసినట్టు గుర్తించారు. ఎండీఎంఏ, కొకైన్, గంజాయి అక్కడ పట్టుబడ్డాయి. మరోవైపు, తాను రేవ్ పార్టీలో ఉన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని టాలీవుడ్ సహాయ నటి ఖండించగా.. బెంగళూరు పోలీసులు మాత్రం ఆమె ఉందని తేల్చిచెప్పారు.