నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్టు వాతావరణ విభాగం వెల్లడించింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు ఆనుకుని నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని పేర్కొంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనాల ప్రభావంతో అల్పపీడనం ఏర్పడినట్టు తెలిపింది. ఇది క్రమంగా బలపడి వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా మారుతందని ఐఎండీ చెప్పింది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 5.8 కి.మీ వరకు ఆవర్తనం విస్తరించి ఉందని పేర్కొంది.
అల్పపీడనం గురువారం ఉదయం నాటికి ఈశాన్య దిశగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని, తర్వాత మరింత బలపడుతుందని అంచనా వేసింది. తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని పేర్కొంది. మే 25 రాత్రి ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటుతుందని కొందరు నిపుణులు అంచనా వేశారు. అయితే, తుఫాన్‌గా మారి ఉత్తర ఒడిశా తీరం దిశగా పయనిస్తుందని ఇంకో నిపుణుడు తెలిపారు
ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ్ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. మత్స్యకారులు చేపలు వేటకు వెళ్లొద్దని, ఇప్పటికే వెళ్లినవారు గురువారం ఉదయానికి వెనక్కి వచ్చేయాలని సూచించింది.
రెండ్రోజులపాటు అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే, సముద్రంలో అలలు భారీ ఎత్తున ఎగిసిపడతాయని హెచ్చరికలు చేసింది. ఇక, తమిళనాడులోని ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రబ్బర్ పడవలు, 30 హెచ్‌పీ పవర్ ఇంజిన్‌తో కూడిన ఫైబర్ బోట్లు, వరదలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు అధునాతన పరికరాలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ కమాండోలను సిద్ధం చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. మే 24 వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలకు అవకాశం ఉందని హెచ్చరించింది. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఐఎండీ సూచించింది.
మే 23 నుంచి 27 మధ్య తుఫాను ప్రభావం మహారాష్ట్ర, గుజరాత్‌లపై ఉంటుందని అంచనా వేసింది. గుజరాత్, ముంబయిలకు మే 28న భారీ వర్ష సూచన ఉందని తెలిపింది. కర్ణాటక, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, తెలంగాణల్లో మే 23 వరకూ ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా, నైరుతి రుతుపవనాలు ఇప్పటికే దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసరాలను తాకాయి. తాజాగా తుఫాన్ ప్రభావంతో అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమరిన్‌లోని మరిన్ని ప్రాాంతాలకు విస్తరించనున్నాయి. మే 30 నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది.