ఐదేళ్ల వైసీపీ అరాచకపాలనకు త్వరలోనే ముగింపు రానున్నదని గురజాల ఉమ్మడి అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూన్ 4న రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాబో తుందన్నారు. రెంటచింతల మండలం పాలు వాయి గేటులోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసంచేసిన మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐదేళ్ల జగన్‌పాలనలో పోలీసువ్యవస్థ నిర్వీర్యమైందని, కొంత మంది అధికారులు నిజాయతీగా పనిచేసినా, మరికొందరి ప్రభుభక్తి పోలీసు శాఖకే మచ్చతెచ్చిందన్నారు. గురజాల, మాచర్ల నియోజకవర్గాలలో వైసీపీ దాష్టీకాలకు పోలీసులు, అధికారులు ఎవరైతే వత్తాసు పలికారో ప్రభుత్వం మారిన అనంతరం వారందరిపై విచారణలు చేపట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఎన్నికలకు ముందు, అనంతరం గురజాల నియోజకవర్గంలో కొంతమంది పోలీసులు వైసీపీకి తొత్తుగా మారి టీడీపీ శ్రేణులపై ఇష్టారాజ్యంగా తప్పుడు కేసులు పెడుతున్నారని యరపతినేని ఆరోపించారు. తంగెడ గ్రామంలో పోలింగ్ బూత్‌పై వైసీపీ గూండాలు బాంబులు విసిరితే టీడీపీ వారిపై హత్యా యత్నం కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. అదేవిధంగా మాదినపాడు, కొత్తపాలెం, మోర్జం పాడు గ్రామాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలను విచక్షణా రహితంగా కొట్టడం దేనికి సంకేతమో ఆ ఎస్‌ఐలు, సీఐలు సమాధానం చెప్పాల న్నారు. ఎన్నికల ఘర్షణలు, అక్రమాలపై సిట్ అధికారుల దర్యాప్తు పారదర్శకంగా సాగాలని, తప్పు చేసిన వారిపై, చేయని వారిపై ఒకేలా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ఈ ఎన్నికల్లో అడ్డగోలుగా, అరాచకంగా వ్యవహరించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డిలు ఇంటికిపోవడం ఖాయమన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఇబ్బందిపడ్డ ప్రజలతో పాటు పార్టీ నేతలకు, కార్యకర్త లకు అండగా ఉంటానని యరపతినేని భరోసా నిచ్చారు. అదే సందర్భంలో ఈ ఐదేళ్లలో టీడీపీ కార్యకర్తలపై నోరు పారేసుకున్న, చేయిచేసుకున్నవారు తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు.