సంచలనం రేపిన బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. బెంగళూరు రేవ్ పార్టీ అంశంలో టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు కాకాణి గోవర్ధన్ రెడ్డి రియాక్టయ్యారు. ముఖ్యంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై.. కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. బ్లడ్ శాంపిల్ ఇద్దాం దమ్ముంటే రావాలంటూ సోమిరెడ్డికి ఛాలెంజ్ చేశారు. రేవ్ పార్టీ దగ్గర తన కారు ఉందంటున్న సోమిరెడ్డి.. అది నా కారేనని నిరూపించగలరా అంటూ సవాల్ చేశారు.
"బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఒక కారుకు నా స్టిక్కర్ ఉందని కథనాలు వచ్చాయి. దీనిపై టీడీపీ నేత సోమిరెడ్డి పలు ఆరోపణలు చేశారు. నా ఆధ్వర్యంలోనే పార్టీ జరిగిందని.. నా పాస్ పోర్ట్ దొరికిందని.. గోపాల్ రెడ్డి నాకు సన్నిహితుడని చెప్పారు. దీనిపై నేను సోమిరెడ్డికి సవాల్ విసురుతున్నా. బ్లడ్ శాంపిల్ ఇచ్చేందుకు సిద్ధం కావాలని సవాల్ చేశా. నా పాస్‌పోర్టు కార్లో దొరికిందంటున్నారు. నా పాస్‌పోర్టు నా దగ్గరే ఉంది. కారులో దొరికిందని చెబుతున్న పాస్‌పోర్టు ఎవరి దగ్గర ఉంది.. సోమిరెడ్డి దగ్గర ఉందా.. కర్ణాటక పోలీసుల వద్ద ఉందా? అని కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.
ఆ కారుతో నాకు సంబంధం ఉందంటున్న సోమిరెడ్డి.. దానిని రుజువు చేయగలరా? కారు తుమ్మల వెంకటేశ్వర రావు పేరుతో ఉంది. కారుకు స్టికర్ ఉందని చెప్పి.. నా కారని అంటున్నారు. స్టికర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశా. వారు విచారణ చేస్తున్నారు. గోపాల్ రెడ్డి అనే వ్యక్తే నాకు తెలియదు. నాతో గోపాల్ రెడ్డికి పరిచయం ఉన్నట్టు ఏ ఆధారం ఉన్నా సోమిరెడ్డి బయట పెట్టాలి. క్లబ్‌కు వెళ్లటం, పేకాట ఆడటం, డ్రగ్స్ ఎవరికి అలవాటు ఉందో తేల్చుకుందాం. బ్లడ్ శాంపిల్ ఇచ్చేందుకు నేను రెడీ. దమ్ముంటే సోమిరెడ్డి రావాలి" అంటూ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఛాలెంజ్ చేశారు.
మరోవైపు సోమిరెడ్డికి చీకటి కోణాలు చాలా ఉన్నాయన్న మంత్రి కాకాణి.. పురాతన పంచలోహ విగ్రహాలను విదేశాలకు అమ్మేందుకు సోమిరెడ్డి గతంలో ప్రయత్నించారని ఆరోపించారు. సోమిరెడ్డిపై తాను చేస్తున్న ఆరోపణలు అన్నీ నిజాలేనని చెప్పారు. ఏవైనా ఉంటే రాజకీయంగా తేల్చుకోవాలే కానీ.. వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదని కాకాణి గోవర్థన్ రెడ్డి చెప్పుకొచ్చారు