సమాజంలో రోజురోజుకూ నేరాలు పెరిగిపోతున్నాయి. ఎవరినీ పూర్తిగా నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. విజయనగరం జిల్లాలో గతంలో వాలంటీర్‌గా పనిచేసిన ఓ యువతి చేసిన నేరం ఆలస్యంగా వెలుగుచూసింది. తాను చేసిన తప్పు ఎవరికీ తెలియదని ఆ యువతి భావించింది. అయితే అనుకోకుండా సీన్ రివర్స్ కావటంతో.. పోలీస్ స్టేషన్ పాలైంది. ఇప్పుడు అందరి ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది.
విజయనగరం జిల్లా బాడంగి మండలం ముగడ అనే గ్రామంలో.. అచ్చెమ్మ అనే వృద్ధురాలు ఒంటరిగా నివశిస్తోంది. ఇక అదే గ్రామంలో స్వాతి అనే యువతి గతంలో వాలంటీర్‌గా పనిచేశారు. అనంతరం రాజీనామా చేశారు. అయితే వాలంటీర్‍గా పనిచేసిన సమయంలో ఏర్పడిన చనువుతో స్వాతి.. ముసలావిడ అని కూడా చూడకుండా దారుణానికి పాల్పడింది. అచ్చెమ్మ ఒంటరిగా ఉన్న విషయం తెలిసిన స్వాతి.. ఆమె దగ్గర ఉన్న బంగారం మీద కన్నేసింది. ఓ రోజు దానిని కాజేసేందుకు స్వాతికి ఛాన్స్ వచ్చింది.
ఓ రోజు అచ్చెమ్మ ఇంట్లోకి వెళ్లిన స్వాతి.. చుట్టుపక్కల ఎవరూ లేని విషయాన్ని గమనించింది. ఇక అదే అదనుగా అచ్చెమ్మ నోట్లో గుడ్డలు కుక్కి.. అచ్చెమ్మ దగ్గర ఉన్న 3 తులాల బంగారాన్ని దోచుకెళ్లింది. అయితే దొంగతనం చేసిన స్వాతి.. అచ్చెమ్మ స్పహ తప్పిపడిపోవటంతో చనిపోయిందని భావించింది. దీంతో బంగారాన్ని తీసుకుని అక్కడి నుంచి ఉడాయించింది. అయితే తర్వాత కాసేపటికి మెలకువలోకి వచ్చిన అచ్చెమ్మ.. జరిగిన దారుణాన్ని గుర్తించింది. ఇంట్లోని బంగారం దోచుకెళ్లిన సంగతిని స్థానికులకు తెలియజేయగా.. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అయితే వృద్ధురాలు చనిపోయిందని అక్కడి నుంచి ఉడాయించిన స్వాతి.. అచ్చెమ్మ బతికే ఉందని తెలుసుకుని షాక్ గురైంది. ఇక విషయం పోలీసుల వరకూ చేరటంతో భయపడిపోయింది. పోలీస్ స్టేషన్ నుంచి పిలుపురావటంతో స్టేషన్ వెళ్లిన స్వాతి.. తాను దొంగతనం చేయలేదని తొలుత బుకాయించింది. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో చివరకు చేసిన తప్పు ఒప్పుకుంది. బంగారాన్ని తానే తీసుకున్నట్లు అంగీకరించిన స్వాతి.. తిరిగి ఇచ్చేసేందుకు అంగీకరించింది. ఆ రకంగా వృద్ధురాలు చనిపోయిందని బంగారంతో ఉడాయించిన స్వాతి బండారం.. సీన్ రివర్స్ కావటంతో అందరికీ తెలిసిపోయింది.