పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ధ్వంసం చేసిన ఘటనను ఈసీ సీరియస్‌గా ఉంటుంది. ఈ ఘటనపై సరైన సమాచారం ఇవ్వలేదనే కారణంతో.. పాల్వాయి గేటు పోలింగ్ అధికారి (పీవో), సహాయ పోలింగ్ అధికారి (ఏపీవో)లను సస్పెండ్ చేశారు. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో సత్తెనపల్లి జీజేసీ జూనియర్ కాలేజీ లెక్చరర్పీవీ సుబ్బారావు పీవోగా, వెంకటపురం జెడ్పీ ఉన్నత పాఠశాల టీచర్ షేక్ షహనాజ్ బేగం ఏపీవోగా వ్యవహరించారు.
ఈ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేయడంతో.. అక్కడ పోలింగ్ సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలతో పీవో, ఏపీవోలను విధుల నుంచి తొలగిస్తూ జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేశ్ బాలాజీరావు ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ రోజు ఎన్నికల నియమావళిని ఉల్లఘించారని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
మరోవైపు పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ఎమ్మెల్యే ధ్వంసం చేసిన వీడియో ఎన్నికల సంఘం నుంచి బయటకు వెళ్లలేదన్నారు సీఈవో ముఖేష్ కుమార్ మీనా. ఈ కేసు దర్యాప్తు సమయంలో బయటకు వెళ్లి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. మాచర్ల నియోజకవర్గంలో పరిస్థితులు అదుపులో ఉన్నాయని.. ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గానికి బయటి నుంచి ఎవరినీ అనుమతించడం లేదని తెలిపారు. టీడీపీ నేతలు ఇలాంటి సమయంలో పార్టీ కార్యకర్తల్ని పరామర్శించేందుకు వెళ్లడం సరికాదన్నారు.ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తుంటే.. ఇలాంటి సమయంలో పరామర్శలు సరికాదన్నారు.
మరోవైపు మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేటులోని ఓ పోలింగ్ బూత్‌లో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై వాదనలు వినిపించగా.. కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆయన్ను జూన్ 6 వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు, పోటీలో ఉన్న అభ్యర్థులు ఏజెంట్లను నియమించుకోవాల్సి ఉండటంతో రక్షణ కల్పించాలని లాయర్లు కోరగా.. కోర్టు అంగీకరించింది.
ఏపీ హైకోర్టు కొన్ని షరతులతో పిటిషనర్లకు అరెస్టు నుంచి ఊరట కల్పించింది. ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల వెంట నలుగురికి మించి ఉండకూడదని షరతు విధించారు. ఎన్నికల సంఘం పోలీసులతో నిఘా, పర్యవేక్షణలో వీరిని ఉంచాలని కోర్టు ఆదేశించింది. అంతేకాదు ఈ కేసులో సాక్షులను బెదిరించకూడదని, దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. తాము కేసు లోతుల్లోకి వెళ్లకుండా తాత్కాలిక ఉత్తర్వులిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. ఈ పిటిషన్లపై పోలీసులు కౌంటరు దాఖలుచేయాలని ఆదేశించిన కోర్టు.. విచారణను జూన్ 6కి వాయిదా వేశారు.