పాలక ప్రభుత్వాలు చేనేత పరిశ్రమ పట్ల అవలంభిస్తున్న విధానాలు కార్మికుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయని ఆంధ్రప్రదేశ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి గొట్టుముక్కల బాలాజీ అన్నారు. రేపల్లె సీపీఐ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న విధానాల ఫలితంగా చేనేత పరిశ్రమ రోజురోజుకు సంక్షోభంలో కూరుకుపోతుండటంతో ఉపాధిని కోల్పోతూ అప్పులు పాలవుతూ తీర్చే మార్గం లేక అర్ధాకలితో బతుకులు సాగిస్తూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అనంతపురం జిల్లా పెద్దవడుగోలుకు చెందిన కుళ్ళాయప్ప అనే చేనేత కార్మికుడు సోమవారం ఆత్మహత్య చేసుకోగా సత్యసాయి జిల్లా ధర్మవరంనకు చెందిన చేనేత కార్మికుడు శీల బాలశౌడయ్య బుధవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందాడని చెప్పారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నూలు రంగులు, రసాయనాలు, వస్ర్తాలపై 47 శాతం పన్ను విధించటంతో చేనేత వస్ర్తాల అమ్మకాలు పడిపోయి కార్మికులకు పనులు లేకుండా పోయిందన్నారు. ఆత్మహత్యలకు గురైన చేనేత కార్మిక కుటుంబాలకు రూ.50 లక్షలు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని బాలాజీ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏపీ చేనేత కార్మిక సమితి సభ్యులు కొడాలి రామకోటేశ్వరరావు, ఏఐటీయూసీ నాయకులు సిహెచ శివశంకర్ పాల్గొన్నారు.