ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి కౌంటింగ్ కేంద్రం వద్ద శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాజానగరం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎ.చైత్రవర్షిణి, నార్త్‌జోన్ డీఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలు, నియమ నిబంధనలపై ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు శుక్రవారం అవగాహన కలిగించారు. నియోజకవర్గంలోని 216 పోలింగ్ కేంద్రాలకుగానూ ఓట్ల లెక్కింపునకు 14 టేబుల్స్, పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపునకు 4, ట్యాబ్‌లేషన్ లేబుల్స్ 2 ఏర్పాటు చేస్తామన్నారు. 15 రౌండ్లు పూర్తిగాను, 16వ రౌండ్‌లో 5, 6 టేబుల్స్‌లో లెక్కింపుతో మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తై, పూర్తిస్థాయి ఫలితం అధికారికంగా వెలువడుతుందన్నారు. ఓట్ల లెక్కింపునకు వచ్చే రాజకీయ పార్టీల ఏజెంట్లు ఆరోజు ఉదయం 7గంటలకే లెక్కింపు కేంద్రాల వద్దకు చేరుకోవాలన్నారు. ఒక్కో టేబుల్‌కు ఒక పార్టీ తరపున ఒక ఏజెంట్‌ను మాత్రమే అనుమతిస్తామని, కౌంటింగ్ టేబుల్‌కు అవతల వైపున ఏర్పాటు చేసిన మెస్‌కు వెలుపల ఉండి మాత్రమే ఓట్ల లెక్కింపును పరిశీలించుకోవాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల కోడ్ జూన్ 6వ తేదీ వరకు అమల్లో ఉంటుందని, అప్పటి వరకు ర్యాలీలు, సమావేశాలు, బాణసంచా కాల్పులు వంటి కార్యకలాపాలు నిషేధించామన్నారు. బాణసంచా విక్రయించే దుకాణాలు, గోదాములు మూసివేయించామన్నారు. 6వ తేదీ తర్వాత ఇందుకోసం సంబంధిత అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఆర్వో, డీఎస్పీ చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.