ఉన్నత చదువులు అభ్యసించేందుకు విద్యార్థులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాల జారీ జాప్యమవుతోంది. సార్వత్రిక ఎన్నికల పోరు షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి కాకినాడ జిల్లాలోని అన్ని మండల రెవెన్యూ కార్యాలయాల అధి కారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో కుల, ఆదాయ, నివాస తదితర ధ్రు వీకరణ పత్రాల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. అడ్మిషన్ల ప్రక్రియ త్వరలో మొదలుకానుండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సర్టిఫికెట్ల కోసం ఎదురుచూస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయినా వెబ్‌సైట్‌లు తెరుచుకోవడం లేదని వాపో తున్నారు. నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ధ్రువీకరణ పత్రాల అవసరం పెరిగింది. విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థ ల్లో చేరేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆయా విద్యాసంస్థల్లో చేరేందుకు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల అవసరం ఉంటుంది. ఈ మేరకు విద్యార్థులు మీసేవ, సచివాలయాల ద్వారా దరఖాస్తులు చేసుకున్నా సర్టిఫికెట్లు జారీచేయడం లేదని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ప్రముఖ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు వేగంగా పూర్తయిపోతుండడంతో విద్యార్థుల తల్లిదం డ్రులు కూడా ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. ఆయా యాజమాన్యాలను కొద్దిరోజులు గడువు అడుగుతున్నా రు. అధికారులు స్పందించి త్వరితగతిన ధ్రువపత్రాలు జారీ చేయాలని వారు కోరుతున్నారు. ఈ విషయమై సామర్లకోట తహశీల్దార్ శ్రీనివాస్ వద్ద ప్రస్తావించగా పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తరువాత వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య కారణంగా సర్టిఫికెట్లు మంజూరు కాలేదన్నారు. ప్రస్తుతం చాలామంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశామని, పెండింగ్‌లో ఉన్న వాటిని కూడా రెండు రోజుల్లో జారీ చేస్తామని తెలిపారు.