ఎన్నికల కమిషన్ నియమించిన అధికారులే సస్పెండైతే వైఫల్యం ఎవరిదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. వెబ్‌కాస్టింగ్‌ల బహిర్గతంపై ఎన్నికల కమిషన్ పక్షపాతధోరణి తగదన్నారు. విజయనగరంలో మంత్రి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ...... మేం ఎన్నికల మేనిఫెస్టోను ఒక పవిత్రగ్రంథంలా చూసుకుంటామనేది ప్రజలందరికీ తెలుసు. గడచిన ఐదేళ్ల కాలంలో వైఎస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టో హామీల్ని ఏ విధంగా అమలు చేశామనేది.. రాబోయే ఐదేళ్లకూ మా పనితీరు ఎలా ఉంటుందనేది ప్రజలకు ఇప్పటికే అర్ధమైంది. విద్యావైద్యం రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలను తెచ్చి.. ప్రజల జీవన విధానంలో ఎలాంటి మార్పులు తెచ్చామనేది కూడా వారు కళ్లారా చూస్తున్నారు. కాబట్టే.. మా అధినేత జగన్ గారు కోరినట్టు మీ కుటుంబంలో మంచి జరిగితేనే మరోమారు మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించమన్నారు. ఆమేరకే, ప్రజలంతా నిన్నటి ఎన్నికల్లో తమ విలువైన ఓటు ద్వారా వారి ఆశీస్సులను వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వానికి అనుకూలంగా అందించారు. జూన్ 4 ఫలితాల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయ ప్రభంజనంతో జగన్ గారు మళ్లీ ముఖ్యమంత్రిగా విశాఖలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని అన్నారు.