డిస్కౌంట్, ఆఫర్.. ఈ రెండు పదాలు వింటే చాలు సగటు భారతీయుడు మనసు జివ్వున అటువైపు లాగుతుంది. అందులోనూ మరీ ముఖ్యంగా మన తెలుగు ప్రజలు ఆఫర్ అంటే చాలు క్యూకట్టేస్తుంటారు. అందుకే వివిధ సంస్థలు సైతం పండుగ ఆఫర్లు, ఆషాడం సేల్స్ అంటూ ఆకర్షణీయ ప్రకటనలు ఇస్తుంటాయి. 499, 999 అంటూ మ్యాజిక్ ఫిగర్లతో కస్టమర్లను బుట్టలో పడేస్తుంటాయి. ఇక అప్పుడప్పుడూ బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ సేల్ అంటూ పలు బ్రాండెడ్ వస్తువుల మీద భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయి. విజయవాడలోనూ అలాంటి ఆఫరే ఒకటి ప్రకటించారు.
బిగ్గెస్ట్ డిస్కౌంట్ సేల్ ఎవర్ అంటూ.. విజయవాడలోని నోవాటెల్ హోటల్ వద్ద ఓ ఎగ్జిబిషన్ సేల్ ఏర్పాటు చేశారు. బ్రాండెడ్ రెడీమేడ్ వస్త్రాలు, షూల మీద భారీ డిస్కౌంట్లు ప్రకటించారు. ఫిలా, అడిడాస్ వంటి బ్రాండెడ్ షూలతో పాటుగా రేమండ్ వంటి బ్రాండ్ వస్త్రాలను కూడా డిస్కౌంట్ రేట్లకే అందిస్తామని ప్రకటించారు. అందులోనూ 80 శాతం వరకూ డిస్కౌంట్ అని ప్రకటనలు ఇవ్వటంతో నగరవాసులు నోవాటెల్ వద్ద క్యూ కట్టారు. కొంతమంది చిన్నారులను సైతం వెంటబెట్టుకుని నోవాటెల్ చేరుకున్నారు. భారీగా వచ్చిన కస్టమర్లతో నోవాటెల్ ప్రాంగణం కిటికిటలాడిపోయింద.
అయితే ఇదే సమయంలో విజయవాడలో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు ప్రవహించింది. లోతట్టు ప్రాంతాల్లోకి కూడా నీరు చేరింది. అయితే ఆఫర్ మిస్ చేసుకోకూడదనే పట్టుదలతో కస్టమర్లు అందరూ గొడుగులు పట్టుకుని మరీ నోవాటెల్ వద్ద రోడ్డుపైన నిల్చోవడం విశేషం. చిన్నారులను వెంటబెట్టుకుని, ఓ చేత్తో గొడుగు పట్టుకుని నోవాటెల్ ఎదురుగా క్యూ కట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గొడుగులు పట్టుకుని నోవాటెల్ ఎదురుగా జనం బారులు తీరిన దృశ్యాలను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన కొద్దిమంది నెటిజనం హోటల్ నిర్వాహకుల తీరును తప్పుబడుతున్నారు. ఆఫర్ పేరిట వర్షంలో నిలబెడతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఆఫర్ పేరు చెప్పగానే వర్షంలో క్యూ కడతారా అంటూ కస్టమర్ల తీరుపై సైతం కామెంట్లు చేస్తున్నారు.