అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టుల డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జి.కె.వీధి మండలం, గాలికొండ పంచాయితీ, సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పనసలబంద అటవీ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మావోయిస్టుల కదలికల గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. పనసలబంద అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో అడవిలో మావోయిస్టులు దాచిన డంప్‌ను పోలీసులు గుర్తించారు. పోలీసులపై దాడి చేయాలనే ఉద్దేశంతో ఈ డంప్‌ను ఏర్పాటు చేయగా.. కూంబింగ్ సమయంలో ఈ డంప్‌ను పోలీసులు గుర్తించారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న డంప్‌లో మందుపాతరలు, పేలుడు పదార్ధాలు, విప్లవ సాహిత్యం ఉన్నాయి. మరోవైపు ఇలాంటి డంప్‌లు ఇంకా ఏమైనా దాచిపెట్టారా అనే కోణంలో పోలీసులు పరిసర ప్రాంతాలను గాలిస్తున్నారు. ఈ డంప్‌లో స్టీల్ క్యారేజీలలో దాచిన ఆరు మందుపాతరలు, రెండు డైరక్షన్ మైన్స్, పేలుడు పదార్థాలు, 150 మీటర్ల పొడవైన వైర్లు, ఐదుకేజీల మేకులు, ఇనుపనట్లు, విప్లవ సాహిత్యం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు అల్లూరి జిల్లా పరిధిలో మావోయిస్టులు దాచిన డంప్‌లు అన్నింటినీ త్వరలోనే గుర్తించి, ధ్వంసం చేస్తామని అల్లూరి సీతారామరాజు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తుహీన్ సిన్హా తెలిపారు. గిరిజన ప్రజలు అందరూ ప్రశాంతంగా జీవించాలనేదే తమ ఉద్దేశమన్నారు. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు కాలం చెల్లినవని, గిరిజన ప్రజలు అందరూ కూడా మావోయిస్టు పార్టీకి దూరంగా ఉండాలని సూచించారు. యువతీ యువకులు అందరు అల్లూరి గిరిజన ప్రాంత అభివృద్ధికి పాటుపడాలని కోరారు.