కడప జిల్లాలో కిలాడీ లేడీ చోరీ వ్యవహారం బయటపడింది. రుణాల పేరుతో మహిళలకు మాయ మాటలు చెప్పి ఇంటికి పిలిచేది.. వాళ్ల ఇంటి తాళాలు నొక్కేసి చోరీలు చేస్తోంది. ఈమె ఘరానా దొంగతనాల గురించి తెలిసి పోలీసులే అవాక్కయ్యారు. ప్రొద్దుటూరు మౌలానా ఆజాద్ వీధి-2లో జహరా తాజ్ నివాసం ఉంటోంది. ఆమె పొదుపు సంఘం గ్రూపునకు లీడర్‌గా ఉన్నారు.. తన గ్రూపులోని సభ్యులకు బంగారు ఆభరణాలు ఉన్నాయని ఆమెకు తెలిసింది. ఆమె గ్రూప్ సభ్యుల ఇళ్లలో బంగారాన్ని చోరీ చేసేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది. రుణాల పేరుతో గ్రూపు సభ్యులకు మాయ మాటలు చెప్పింది.
గ్రూపులోని సభ్యుల్ని రుణాల పేరు చెప్పి ఇంటికి పిలిపించేది.. వారితో మాటలు కలిపి వారి హ్యాండ్‌బ్యాగులో ఉన్న ఇంటి తాళాలు మెల్లిగా తీసుకునేది. అందరూ ఇక్కడే ఉండాలని.. తాను వెళ్లి రుణం గురించి మాట్లాడి వస్తానని వారికి చెప్పేది. ఆమె గ్రూపు సభ్యుల ఇళ్లకు నేరుగా వెళ్లి బీరువాలోని బంగారాన్ని దొంగతనం చేసేది. జహరా ఇలాగే మౌలానా ఆజాద్ వీధిలోని రెండు ఇళ్లు, కేహెచ్‌ఎం వీధిలోని మరో ఇంట్లో చోరీలు చేసింది. మొత్తం 35 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లింది. వెంటనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
పోలీసులు తమ దర్యాప్తులో జహరా చోరీలు చేసినట్లు గుర్తించారు.. ఆమె దొంగతనం చసిన నగల్ని కరిగించి ఆభరణాలు తయారు చేయించేందుకు నెల్లూరు బయల్దేరింది. ఈ క్రమంలో ఆమెను పోలీసులు ప్రొద్దుటూరు గంగమ్మ దేవాలయం వీధిలో అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి 31 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ బంగారం విలువు రూ.22.32 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.