కృష్ణా జిల్లా గుడివాడలో ఘరానా మోసం బయటపడింది. మహిళల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని.. రుణాలు ఇప్పించి.. అందులో వారి దగ్గర కొంత డబ్బు తీసుకుని నిండా ముంచేసిందో మహిళ. గుడివాడ మండలం మల్లాయపాలెం పరిధిలోని లక్ష్మీనగర్‌లో లీలావతి నివాసం ఉంటోంది. ఆమె పలు బ్యాంకుల సిబ్బందితో మాట్లాడి మహిళలతో పాటూ పలువురికి లోన్లు ఇప్పించింది. లీలావతికి కొన్ని మైక్రో ఫైనాన్స్ సంస్థల ప్రతినిధులతోనూ కూడా పరిచయం ఉంది. ఆ మైక్రో సంస్థల్లో రుణాల కోసం కొన్ని గ్రూపుల్ని కూడా ఏర్పాటు చేసింది.
ఈ మైక్రో సంస్థల ద్వారా వచ్చే రుణంలో కొంత తనకు ఇవ్వమని లీలావతి అడిగేది.. ఆ డబ్బుల్ని తిరిగి ఇచ్చేస్తానని చెప్పి నమ్మించేది. ఇలా మెల్లిగా చాలామంది ఆమెకు డబ్బులు ఇచ్చారు.. ఇలా ఆమె ఏకంగా దాదాపు 60కిపైగా గ్రూపులను ప్రారంభించించడం విశేషం. ఆ గ్రూపుల్లోని సభ్యుల నుంచి రూ.1.5 కోట్ల వరకు డబ్బుల్ని తీసుకొని తిరిగి ఇవ్వలేదు. అక్కడితో ఆగకుండా.. చాలా మందికి చెందిన బంగారు ఆభరణాలను కూడా తాకట్టు పెట్టి విడిపించలేదట. అయితే ఆమె డబ్బులు గురించి అడిగితే.. తానే బ్యాంకులకు చెల్లిస్తానని నమ్మబలికేది.. కానీ ఆ రుణాలను మాత్రం చెల్లించలేదు. అంతేకాదు ఆమె ప్రారంభించిన గ్రూపుల్లోని సభ్యుల దగ్గర బంగారు ఆభరణాలు తీసుకొని రుణాలు ఇప్పిస్తానని తమతో చెప్పిందని.. తమకు తెలియకుండా వాటిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టిందని ఆరోపిస్తున్నారు. ఇలా వచ్చిన డబ్బుల్ని ఆమె తీసుకొన్నట్లు చెబుతున్నారు. రుణాలు వచ్చిన విషయం కూడా తమకు చెప్పలేదంటున్నారు.
ఈ క్రమంలో ఆమె ద్వారా రుణాలు తీసుకున్న పలువురి ఇళ్లకు బ్యాంకు సిబ్బంది వెళ్లి ఒత్తిడి చేస్తున్నారు. ఇలా ఆమె చేతిలో దాదాపు 60మంది వరకు మోసపోయిన బాధితులు ఉన్నారని చెబుతున్నారు. అంతేకాదు లీలావతి కుమారుడు, కుమార్తె కూడా ఈ దందాలో ఉన్నారని చెబుతున్నారు. గుడివాడ నుంచి వెళ్లిపోయిన లీలావతి హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఉందని కొంతమంది బాధితులకు తెలిసింది. వెంటనే వారంతా అక్కడికి వెళ్లారు.. ఆమె ఇంటి దగ్గర ఆందోళన చేశారు. అయినా లాభం లేకుండా పోయిందని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక మైక్రో ఫైనాన్స్ సంస్థ దగ్గర బంగారాన్ని తాకట్టు పెట్టి.. ఆ తర్వాత గుడివాడ నంచి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. గుడివాడలోని జగనన్న కాలనీ, టిడ్కో కాలనీ, బాపూజినగర్, లక్ష్మీనగర్ కాలనీ, చౌదరిపేట, ఆర్టీసీ కాలనీ, తదితర ప్రాంతాల్లో లీలావతి బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా లీలావతి బాధితులు వస్తున్నారని.. ఆమె తమను మోసం చేసిందని ఆరోపిస్తున్నారన్నారు. పూర్తి ఆధారాలతో రావాలని వారందరికి సూచించినట్లు పోలీసులు తెలిపారు. అవన్నీ పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామంటున్నారు.