కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులతో పాటుగా వారాంతం కావటంతో శనివారం తిరుమలకు శ్రీవారి భక్తులు పోటెత్తారు. భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. ఔటర్ రింగ్ రోడ్డులోని శిలాతోరణం వరకూ క్యూలైన్ విస్తరించింది. మరోవైపు భక్తులు భారీ సంఖ్యలో తరలిరావటంతో వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆక్టోపస్ సర్కిల్ నుంచి కృష్ణతేజ సర్కిల్ వరకూ మంచినీటి ఏర్పాటు చేసింది.
27చోట్ల మంచినీటి సరఫరా కేంద్రాలు, నాలుగు చోట్ల అన్నప్రసాదం పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే 25 మంది విజిలెన్స్ గార్డులు, ముగ్గురు శ్రీవారి సేవకులను ప్రతి పాయింట్ వద్ద ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి షిప్టులోనూ ఇంత మంది పనిచేసేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. మరోవైపు గత పదిరోజుల వ్యవధిలో అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల ద్వారా నడిచివెళ్లి.. తిరుమల శ్రీవారిని సుమారుగా 2.60 లక్షల మంది దర్శించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, తిరుమలలోని అన్న ప్రసాద కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనంతో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉన్న చోట్ల ఆహారం, పాలు, త్రాగు నీరు అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
అలాగే భక్తుల సౌకర్యం కోసం అక్టోపస్ భవనం నుంచి శిలాతోరణం వరకు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశారు. శనివారం మధ్యాహ్నానికి వెంగమాంబ అన్నప్రసాద భవనంలో దాదాపు 60 వేల మందికి పైగా అన్న ప్రసాదం అందించారు. అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ క్యూలైన్లలో 50 వేల మంది భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.
మరోవైపు భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో టీటీడీ అనేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే జూన్ 30వ తేదీ వరకూ శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దుచేశారు. ఈ సమయంలో సిఫార్సు లేఖలు స్వీకరించమని టీటీడీ ఇప్పటికే స్పష్టం చేసింది. వేసవి సెలవులు ముగింపుతో పాటుగా.. పరీక్షా ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో భక్తుల రద్దీ మరింత పెరగవచ్చని టీటీడీ భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది.