ఆంధ్రప్రదేశ్‌లో విభిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతుండగా.. మరికొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా బలపడగా ఇవాళ తుఫాన్‌గా మారనుంది.. ఏపీకి ప్రమాదం తప్పిందని వాతావరణశాఖ తెలిపింది. అయితే ఇవాళ అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇటు పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
శుక్రవారం ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. సాయంత్రం 5 గంటలకు కాకినాడ రూరల్లో 96మిమీ, శంఖవరంలో 65.2, పిఠాపురంలో 62.5,పెదపూడి 59, అనకాపల్లి జిల్లా యలమంచిలిలో 42.7మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది. దాదాపు 60 ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం కురిసినట్లు తెలిపారు.ప్రజలు ఎండ తీవ్రత,పిడుగుపాటు వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో కాకినాడ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. శుక్రవారం ఈదురుగాలులతోపాటు కుండపోతగా వాన పడింది. కాకినాడలో ఏకంగా మూడు గంటలపాటు వర్షం కురవడంతో మెయిన్ రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈదురుగాలులకు పలుచోట్ల కరెంట్ వైర్లు తెగిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
మరోవైపు ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో 10, విజయనగరం జిల్లాలో 15, పార్వతీపురం మన్యం జిల్లాలో 5, అనకాపల్లి జిల్లాలో 5 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. శుక్రవారం తిరుపతి జిల్లా నాయుడుపేటలో 42.9 డిగ్రీలు, నంద్యాల జిల్లా బనగానపల్లిలో 42.2 డిగ్రీలు, నెల్లూరు జిల్లా మనుబోలులో 42.2 డిగ్రీలు, ప్రకాశం జిల్లా పామూరులో 42 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది.
ఇదిలా ఉంటే.. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారింది.. ఇది శనివారం ఉదయానికి తుఫాన్‌గా మారుతుందని అంచనా వేస్తున్నారు. అనంతరం రాత్రికి తీవ్ర తుఫాన్‌గా మారుతుందని.. ఆదివారం అర్ధరాత్రి సమయంలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈ తుపాన్‌కు రెమాల్ అనే పేరు పెట్టారు. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉండదని వాతావరణశాఖ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టి మళ్లీ ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. ఎండలకు తోడు వేడిగాలుల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.