పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. పాల్వాయిగేటులో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో.. జూన్ 6 వరకు ఆయన్ను అరెస్ట్ చేయొద్దని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో కోర్టు కొన్ని కీలక షరతులు విధించింది. పిన్నెల్లి మాచర్ల నియోజకవర్గంలోకి అడుగుపెట్టొద్దని.. ఆయన జూన్ 6 వరకు నరసరావుపేట (పార్లమెంటు నియోజకవర్గ కేంద్రం)లోనే ఉండాలని ఆదేశించింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు కేంద్రం మరోచోట ఉంటే.. అక్కడికి వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఇచ్చింది.
పిన్నెల్లి ఈ కేసులో పాత్ర గురించి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడకూడదని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు ఈ కేసులో సాక్షులను కలవడానికి వీల్లేదని.. వారిని ప్రభావితం, భయపెట్టడం చేయకూడదని స్పష్టం చేసింది. ఒకవేళ అనుచరులు ఏదైనా చర్యలకు పాల్పడితే పిన్నెల్లిదే బాధ్యతని కూడా తెలిపింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత రామకృష్ణారెడ్డిదేనని కోర్టు చెప్పింది.
పల్నాడు జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దని.. ఎలాంటి నేరపూర్వక కార్యకలాపాల్లో జోక్యం చేసుకోకూడదని చెప్పింది. మరోసారి నేర ఘటనలను పునరావృతం చేయకూడదని.. అలాగే పిన్నెల్లి కదలికలపై పోలీసు అధికారులతో నిఘా ఉంచేలా చూడాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. పిన్నెల్లి ఈ షరతులను ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు పోలీసులకు స్వేచ్ఛ ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రధాన బెయిల్ పిటిషన్‌లో కౌంటర్ వేసేందుకు పోలీసులకు అవకాశం ఇచ్చిన కోర్టు.. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భాగంగా.. ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లా పాల్వాయిగేటులో ఉన్న పోలింగ్ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్‌ను ధ్వంసం చేసిన ఘటనలో రెంటచింతల పోలీసులు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. గురువారం అత్యవసరంగా విచారణ జరిపిన హైకోర్టు.. పిన్నెల్లికి షరతులతో ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు ఆయనకు కొన్ని షరతుల్ని విధించగా.. శుక్రవారం ఆ తీర్పు అందుబాటులోకి వచ్చింది.
మరోవైపు పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటలనపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలను సిట్ అధికారులు పరిశీలించారు. ఈ వీడియోలలో ఉన్నవారిపై కేసుల నమోదుపై ఆరా తీస్తున్నారు. ఇటు నరసరావుపేట పట్టణంలోని పోలీసు స్టేషన్‌ల్లో నమోదైన కేసుల రికార్డులను మరోసారి సిట్ అధికారులు పరిశీలించారు. జిల్లాలో ఘటనలపై ఆరా తీస్తున్నారు.