ప్రస్తుతం దేశంలో ఆరో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కేంద్రమంత్రి జై శంకర్.. ఓ పోలింగ్ బూత్‌కు వెళ్లారు. ఓటర్లతోపాటే క్యూ లైన్లలో నిలబడిన జై శంకర్.. తీరా పోలింగ్ బూత్‌లోకి వెళ్లిన తర్వాత షాక్ తగిలింది. ఓటర్ లిస్ట్ చెక్ చేసిన అధికారులు.. జై శంకర్ పేరు లేదని తేల్చి చెప్పారు. అయితే ఒకటికి రెండుసార్లు అక్కడే తన పేరును ఓటరు జాబితాలో చెక్ చేసుకున్న జై శంకర్.. ఎంతకూ కనిపించకపోవడంతో నిరాశగా ఇంటికి వెనుదిరిగారు. ఇక జై శంకర్‌కు ఎన్నికల సంఘం ఒక సర్టిఫికెట్ ఇవ్వడం ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంతకీ ఆయనకు ఎందుకు ఇచ్చారంటే?
లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్‌లో భాగంగా ఢిల్లీలోని 7 స్థానాలకు ఈ దశలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే న్యూ ఢిల్లీ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ స్టేషన్‌కు.. విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఉదయాన్నే వెళ్లారు. 20 నిమిషాల పాటు క్యూ లైన్లలో సాధారణ ఓటర్లతోపాటు నిలబడిన ఆయన.. చివరికి పోలింగ్ బూత్‌లోకి వెళ్లారు. అయితే జై శంకర్ ఓటర్ కార్డు చూసి.. ఓటర్ లిస్ట్‌లో పేరు చెక్ చేయగా.. అందులో కనిపించలేదు. దీంతో జై శంకర్‌తోపాటు అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. ఎంతకీ ఆయన పేరు లేకపోవడంతో ఆయన ఇంటికి వెళ్లిపోయారు.
ఓటర్ జాబితాలో తన పేరు ఎందుకు లేదని ఇంటికి వెళ్లిన తర్వాత కూడా మరోసారి జై శంకర్ తనిఖీ చేశారు. అప్పుడే అసలు విషయం బయటికి వచ్చింది. తాను వెళ్లిన పోలింగ్ బూత్ కాకుండా వేరే పోలింగ్ బూత్‌లో తనకు ఓటు ఉందని గుర్తించారు. దీంతో వెంటనే ఆ పోలింగ్ బూత్‌కు వెళ్లారు. చివరికి ఆ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. అయితే అక్కడే మరొక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఆ పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన తొలి పురుషుడు.. జై శంకర్ కావడం గమనార్హం. దీంతో ఆ పోలింగ్ స్టేషన్‌లో ఉన్న అధికారులు.. జై శంకర్‌కు ఒక సర్టిఫికెట్ ఇచ్చారు.
ఈ విషయాన్ని జై శంకర్ ట్విటర్ వేదికగా షేర్ చేస్తూ ఆ సర్టిఫికెట్‌ను చూపించారు. ఈ క్రమంలోనే ఓటర్లు భారీగా తరలివచ్చి.. ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. తాను న్యూ ఢిల్లీలో ఓటు వేశానని.. మిగిలిన ఓటర్లు కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఓటు వేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన జై శంకర్.. భారతదేశానికి ఇదొక నిర్ణయాత్మక సమయం అని.. అందుకే ప్రజలంతా బయటికి వచ్చి ఓటు వేయాలని కోరుతున్నట్లు చెప్పారు.