గుజరాత్‌లోని రాజ్‌కోట్ నగరంలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. టీఆర్పీ గేమింగ్ జోన్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో 300 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. గేమింగ్ జోన్ కావడంతో అందులో చిన్న పిల్లలే ఎక్కువ మంది ఉన్నారని పేర్కొన్నారు. ఇక ఈ దుర్ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 33 కు చేరగా.. ఇంకా శిథిలాల కింద గాలింపు కొనసాగుతూనే ఉంది. భారీగా మంటలు చెలరేగడంతో చాలా మంది.. ఆ మంటల కిందే కాలి బూడిదైనట్లు అనుమానిస్తున్నారు. ఇక కొందరి మృతదేహాలు బాగా కాలిపోవడంతో గుర్తించడానికి కూడా వీలు లేకుండా పోయిందని.. దీంతో బాధితులు ఎవరు అనేది కనిపెట్టలేకపోతున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన రాజ్‌కోట్ సిటీ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ పోలీసులు.. అసలు టీఆర్పీ గేమింగ్ జోన్‌లో అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. అయితే గేమింగ్ జోన్‌లో 2 వేల లీటర్ల డీజిల్, 1500 ల లీటర్ల పెట్రోల్ నిల్వ చేసి ఉందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అయితే గేమింగ్ జోన్‌లో వెల్డింగ్ పనులు జరుగుతుండగా.. నిప్పు రవ్వలు ఎగిరిపడి మంటలు చెలరేగాయని.. అవి కాస్తా పెట్రోల్, డీజిల్ నిల్వలకు అంటుకోవడంతో అగ్ని ప్రమాదం సంభవించింది.
దీంతో మంటలకు పెట్రోల్, డీజిల్ తోడు కావడంతో భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. ఈ క్రమంలోనే గేమింగ్ జోన్ పై కప్పు ఫైబర్‌తో తయారు చేసి ఉండటం.. అందులోని ఇతర సామాన్లకు వేగంగా మంటలు వ్యాపించడంతో చూస్తుండగానే.. భారీ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఫైబర్ పైకప్పు కూలిపోవడంతో దాని కింద చాలా మంది చిక్కుకుని బయటకు రాలేక ప్రాణాలు కోల్పోయారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మృతదేహాలు బాగా కాలిపోయి గుర్తు పట్టలేని స్థితిలో ఉండటంతో వాటికి డీఎన్ఏ పరీక్షలు చేసి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. దీంతో రాజ్‌కోట్ సివిల్ హాస్పిటల్‌లో బాధిత కుటుంబ సభ్యుల ఆర్తనాధాలతో మారుమోగుతున్నాయి. అయితే వేసవి సెలవులు కావడం, పైగా వీకెండ్ శనివారం కావడంతో జనాల రద్దీ భారీగా ఉందని అధికారులు తెలిపారు. దీనికి తోడు సాధారణంగా గేమింగ్ జోన్‌లోకి ఎంట్రీ అయ్యేందుకు టికెట్ ధర రూ.500 ఉండగా.. ఆఫర్ ప్రకటించి దాన్ని కేవలం రూ.99 లకే అందించారని.. అందువల్లనే శనివారం గేమింగ్ జోన్‌లో ప్రజలు భారీగా చిన్న పిల్లలతో వచ్చారని అధికారులు వెల్లడించారు.