ప్రస్తుతం పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకోవడం.. ఆ తర్వాత మళ్లీ పెళ్లిళ్లు చేసుకోవడం విడాకులు తీసుకోవడం సర్వసాధారణం అయిపోయాయి. ఇవి కాకుండా లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంటున్న వారి సంఖ్య కూడా బాగా పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే రకరకాల నేరాలు జరుగుతున్నాయి. సహజీవనంలో ఉన్నవారు ఎక్కువ రోజులు కలిసి ఉండకపోవడం.. విడిపోయే సమయంలో కోపాలు పెంచుకుని హత్యలు చేసుకోవడం వరకు వెళ్తోంది. తాజాగా ఓ యువతి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. అయితే ఆ మహిళకు ఇంతకుముందే రెండు సార్లు వివాహం జరగ్గా.. ఆ ఇద్దరు భర్తలను వదిలేసి.. ప్రస్తుతం బావతో లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంటోంది. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
ఘజియాబాద్ మోడీ నగర్‌లోని జగత్‌పురి కాలనీలో 27 ఏళ్ల యువతి అనుమానాస్పదరీతిలో చనిపోయి కనిపించింది. అయితే ఆ యువతికి ఇదివరకే రెండు పెళ్లిళ్లు కాగా.. ఇద్దరు భర్తలను విడిచిపెట్టింది. ఇప్పుడు తన బావతో లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండగా.. ఆమె బావ, అతని కుటుంబ సభ్యులే ఆ యువతిని హత్య చేశారని ఆరోపిస్తూ ఆమె కుటుంబ సభ్యులు మోడీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
కస్బా పట్లలో నివాసం ఉంటున్న కృష్ణపాల్ సింగ్ కుమార్తె రాఖీ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసేది. ఆమె చాలా కాలంగా జగత్‌పురి కాలనీలో తన మామ కుమార్తె భర్త వరసకు బావ అయ్యే వ్యక్తితో లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంటోంది. ఈ క్రమంలోనే శనివారం ఉదయం రాఖీ హత్యకు గురైనట్లు తమకు సమాచారం అందిందని రాఖీ తమ్ముడు అమిత్ తెలిపాడు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా రాఖీ మృతదేహం నేలపై పడి ఉందని పేర్కొన్నాడు. రాఖీ మెడ, చేతులపై గాయాలు అయినట్లు గుర్తులు ఉన్నాయని అమిత్ వెల్లడించాడు.
రాఖీకి మొదటి వివాహం హుస్సేన్‌పూర్ గ్రామంలో జరగ్గా.. కొన్ని రోజులకే విడాకులు తీసుకుంది. ఆ తర్వాత రెండో వివాహం ఘజియాబాద్‌లో జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ పెళ్లి కూడా ఎక్కువ రోజులు కొనసాగకపోవడంతో రెండో భర్త నుంచి కూడా విడాకులు తీసుకుని వేరుగా ఉంటోంది. ఈ క్రమంలోనే అప్పటికే పెళ్లి అయిన వ్యక్తి తనకు వరసకు బావ కావడంతో అతనితో లివ్ ఇన్ రిలేషన్‌షిప్ చేస్తోంది. మొదట ఈ ఘటనను పరిశీలించిన ఏసీపీ జ్ఞాన్ ప్రకాష్ రాయ్.. ప్రాథమికంగా ఆత్మహత్య అని పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు తెలుస్తాయని తెలిపారు.