రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధిని నాశనం చేసిన వైసీపీ వారు ఘోరంగా ఓడిపోక తప్పదని 33వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులు పేర్కొన్నారు. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ చట్టబద్దతలేని మూడు రాజదానులకు వ్యతిరేకంగా రైతులు, మహిళలు, రైతు కూలీలు ధర్నా శిబిరాలు, ఇళ్ల వద్ద నుంచి చేస్తున్న ఆందోళనలు ఆదివారం నాటికి 1622వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడారు. మూడు రాజధానులనేది ఏ రాష్ట్రానికి లేదన్నారు. తాను పట్టిన కుందేలుకు మూడు కాళ్లే అన్నట్టు జగన్‌రెడ్డి పరిపాలన ఈ ఐదేళ్లు కొనసాగిందన్నారు. అమరావతిపై అక్కసుతోనే జగన్‌రెడ్డి మూడు ముక్కలాటకు తెరతీశారన్నారు. తల్లకిందులుగా తపస్సు చేసినా అమరావతిని అంగుళం కూడా కదల్చలేరన్నారు. న్యాయం ధర్మం భూములు త్యాగం చేసిన తమవైపు ఉందని స్పష్టం చేశారు. పార్లమెంట్ చేసిన విభజన చట్టంలో వన్ క్యాపిటల్ అని నమోదు చేసి ఉందన్నారు. ఆ వన్ క్యాపిటల్‌నే అమరావతి అని స్పష్టం చేశారు. తిరిగి మార్చాలంటే అది కుదిరే పనే కాదని స్పష్టం చేశారు. విశాఖలో ప్రమాణ స్వీకారం డ్రామాలు ఆపాలని హితవు పలికారు. కోట్ల రూపాయాలు బెట్టింగ్‌లలో దండుకోవటానికి వైసీపీ శ్రేణులు విశాఖలో ప్రమాణ స్వీకారం అని డప్పు కొడుతున్నారనారు. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సీఎస్ జవహరెడ్డితో సహా విశాఖలో వైసీపీ నేతలు వేల ఎకరాలు కారుచౌకగా కొన్నారని ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ జరగాల్సిందేన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. దీపాలు వెలిగించి బిల్డ్ అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. రాజధాని 29 గ్రామాలలో ఆందోళనలు, నిరసన దీక్షలు కొనసాగాయి.