పార్వతీపురం మన్యం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. 18 మందితో వెళ్తున్న ఆటో అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. 17 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రమాదం గురించి తెలిసిన స్థానికులు.. వెంటనే అక్కడకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. లోయలోకి దిగి గాయపడిన వారిని బయటకు తీశారు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం వంబరిల్లి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది.18 మంది గిరిజనులతో వెళ్తున్న ఆటో.. ఘాట్ రోడ్డులో బోల్తాపడింది. ఘాట్ రోడ్డులో పైకి ఎక్కుతున్న సమయంలో ఆటో రోడ్డు పక్కనే ఉన్న లోయలోకి పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు కాగా.. ఆటోలోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కార్తీక్ అనే 12 ఏళ్ల బాలుడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా.. 17 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరంతా సంత పూర్తిచేసుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలిసింది. మరోవైపు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానికులు వేగంగా స్పందించారు.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న స్థానికులు.. లోయలోకి దిగి గాయపడినవారిని వెలుపలికి తీసుకువచ్చారు. అనంతరం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పదిమందిని శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రమాద ఘటనపై సీతంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద బాధితుల ఆర్తనాదాలు, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.