రాయలసీమవాసులకు రైల్వేశాఖ అధికారులు శుభవార్త చెప్పింది. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని అనంతపురం మీదుగా రెండు రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు. ఒక రైలు యశ్వంతపూర్ నుంచి కాచిగూడ మీదుగా గయకు (06217/18) శనివారం వెళుతుందని చెప్పారు. మరో రైలు యశ్వంతపూర్ నుంచి విజయవాడ మీదుగా హౌరా మధ్య వారానికి ఒక రోజు నడుస్తుందని ప్రకటనలో తెలియజేశారు.
యశ్వంతపూర్ నుంచి గయకు వెళ్లే (06217) ప్రత్యేక రైలు యశ్వంతపూర్‌లో శనివారం ఉదయం 7.30 గంటలకు బయల్దేరి.. మధ్యాహ్నం 12.25 గంటలకు అనంతపురానికి వస్తుంది. అక్కడి నుంచి బయల్దేరి.. గుత్తి, డోన్ మీదుగా కర్నూలుకు చేరుకుంటింది. అక్కడనుంచి బయల్దేరి కాచిగూడకు రాత్రి 8 గంటలకు వస్తుంది. అనంతరం రామగుండం మీదుగా ఇటార్సీకి వెళుతుంది. అక్కడి నుంచి జబల్‌పూర్, మానిక్‌పూర్, డీడీ ఉపాధ్యాయ జంక్షన్ మీదుగా మరుసటి రోజు రాత్రి 7.30 గంటలకు గయ స్టేషన్‌కు చేరుకుంటుంది.
ఈ రైలు తిరుగు ప్రయాణంలో గురువారం గయ నుంచి యశ్వంతపూర్‌కు (06218) ప్రత్యేక రైలు ఆదివారం రోజున రాత్రి 11.45 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు మరుసటి రోజు ఉదయం 11.20 గంటలకు జబల్‌పూర్‌కు, అనంతరం రాత్రి 9.10 గంటలకు నాగ్‌పూర్ చేరుకుంటుంది. అలాగే కాచిగూడకు ఉదయం 9.10 గంటలకు వస్తుంది.. అక్కడి నుంచి కర్నూలు మీదుగా అనంతపురం సాయంత్రం 4.40 గంటలకు చేరుకుంటుంది. రాత్రి 10 గంటలకు యశ్వంతపూర్‌కు వస్తుంది. ఈ రైలు 26 స్టేషన్‌లలో ఆగుతుందని అధికారులు తెలిపారు.
రెండో రైలు (02864/63) యశ్వంతపూర్ నుంచి హౌరా (కోల్‌కత్తా)కు నడుపుతున్నారు. ఈ ప్రత్యేక రైలు (02864) ప్రతి శనివారం తెల్లవారుజామున 4 గంటలకు యశ్వంతపూర్‌లో బయల్దేరుతుంది. అనంతపురానికి ఉదయం 9.30 గంటలకు.. డోన్‌కు 11.18 గంటలకు వస్తుంది. అక్కడి నుంచి విజయవాడకు సాయంత్రం 6.25 గంటలకు వస్తుంది. ఆ తర్వాత విశాఖపట్నం, విజయనగరం, కటక్ మీదుగా.. మధ్యాహ్నం 1.25 గంటలకు హౌరా చేరుకుంటుంది.
ఈ రైలు (02863) తిరుగు ప్రయాణంలో హౌరా నుంచి యశ్వంతపూర్‌కు ప్రతి గురువారం మధ్యాహ్నం 12.40 గంటలకు బయల్దేరుతుంది. అక్కడి నుంచి రాత్రి 11.47 గంటలకు శ్రీకాకుళం రోడ్డుకు.. అనంతరం విజయనగరం, విశాఖపట్నం మీదుగా.. తెల్లవారుజామున 5 గంటలకు రాజమండ్రి.. విజయవాడ ఉదయం 7.25 గంటలకు వస్తుంది. అక్కడి నుంచి బయల్దేరి డోన్ మీదుగా అనంతపురానికి రాత్రి 7.30 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు యశ్వంతపూర్‌కు అర్ధరాత్రి 12.15 గంటలకు వెళుతుంది. ఈ రైలు 26 స్టేషన్‌లలో ఆగుతుందని రైల్వేశాఖ అధికారులు తెలిపారు.. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.