కర్నూలు జిల్లాలో వజ్రాల వేట కొనసాగుతోంది. పొలాల వెంట స్థానికులతో పాటూ చుట్టు పక్కల జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారు వజ్రాల కోసం గాలిస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. తాజాగా మరో ముగ్గురికి వజ్రాలు దొరికినట్లు తెలుస్తోంది.. ఓ రైతుతో పాటూ ఇద్దరు వ్యవసాయం కూలీలకు వజ్రాలు దొరికినట్లు చెబుతున్నారు. తాజాగా మదనంతపురంనకు చెందిన మరో రైతుకు వజ్రం లభించగా.. ఏకంగా రూ.15 లక్షలకు పెరవలికి చెందిన వ్యాపారి కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇటు ఆదివారం రోజు తుగ్గలి మండలం జొన్నగిరిలో పొలం పనులు చేసుకుంటున్న వ్యవసాయ కూలీలకు చెరో వజ్రం దొరికినట్లు సమాచారం. ఆ రెండు వజ్రాలను స్థానిక వ్యాపారికి విక్రయించారు. సదరు వ్యాపారి ఒక వజ్రానికి రూ.6లక్షలతో పాటు ఐదు తులాల బంగారు నగలను ఇచ్చినట్లు సమాచారం. అలాగే మరో వజ్రాన్ని రూ.లక్షకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. శనివారం కూడా మద్దికెర మండలం హంపలో ఓ రైతుకు వజ్రం దొరకగా.. వ్యాపారి రూ.5 లక్షలకు కొనుగోలు చేశారు. ఈ రెండు రోజుల్లోనే నాలుగు వరకు వజ్రాలు దొరికినట్లు లెక్క.. అయితే ఈ వజ్రాల విక్రయాల వ్యవహారం ఎక్కడా బయటకు రాకుండా అంతా రహస్యంగా పూర్తి చేస్తున్నారు. వ్యాపారులు పొలాల దగ్గర తమ ఏజెంటన్లు రంగంలోకి దించి వజ్రాలు దొరికిన వెంటనే కొనుగోలు చేస్తున్నారు.