ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా దేవరగట్టు పేరు చెప్పగానే అందరికీ ఠక్కున గుర్తొచ్చేది కర్రల సమరం. దసరా సందర్భంగా బన్నీ ఉత్సవం పేరిట కర్రలతో స్థానికులు కొట్లాడుకోవటం.. ఆ మర్నాడు పేపర్లలో రావటం అందరికీ తెలిసిన విషయమే. అయితే కర్రల యుద్ధం వెనుక కూడా ఓ కథ ఉంది. అయితే ఆ కథకు, ఆ కర్రల సమరానికి ఇప్పుడో గుర్తింపు దక్కింది. 2024-25 విద్యా సంవత్సరానికి గానూ.. ఏపీ ప్రభుత్వం ప్రచురించిన పదో తరగతి పాఠ్యపుస్తకాల్లో బన్నీ ఉత్సవానికి చోటుదక్కింది. పదో తరగతి తెలుగు పుస్తకంలో బన్నీ ఉత్సవాన్ని ఓ పాఠంగా చేర్చారు.
అయితే ఈ బన్నీ ఉత్సవం వెనుక కూడా ఓ కథ ఉందని చరిత్రకారులు, పెద్దలు చెప్తుంటారు. కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టు అడవుల్లోని కొండల్లో అప్పట్లో రుషులు, మునులు తపస్సు చేసేవారు. అయితే అదే ప్రాంతంలో ఉండే మణ్యాసురుడు, మల్లాసురులనే రాక్షసులు ఈ రుషుల తపస్సుకు భంగం కలిగించేవారు. దీంతో వీరి ఆగడాల గురించి ఆ మునిపుంగవులు బ్రహ్మవద్ద మొరపెట్టుకోగా.. మహావిష్ణువు వద్దకు వెళ్లాలని బ్రహ్మ సూచించారట. దీంతో ఆ మునులు విష్ణువు వద్దకు వెళ్లగా.. ఆయన కూడా తన వల్లకాదని చెప్పారట. మణ్యాసురుడు, మల్లాసురులు శివభక్తులని వారిని.. కావున పరమేశ్వరుడి వద్దకు వెళ్లారని సూచించారట.
ఇక శ్రీమహావిష్ణువు సూచనతో పరమేశ్వరుడిని శరణు వేడగా.. ఆయన మణ్యాసురుడు, మల్లాసురులను సంహరించుకునేందుకు పూనుకున్నారట. అయితే ఆ అసురులు అహంకారాన్ని వీడి.. పరమేశ్వరుణ్ని శరణు వేడారట. అలాగే కొండపై వెలసి అనుగ్రహించాలని కోరగా.. శివుడు కూర్మావతారంలో ఓ బండరాయికి మూలవిరాట్టుగా అవతరించడం జరిగిందని పెద్దలు చెప్పేమాట. అయితే దసరా రోజున మాలమల్లేశ్వర స్వామికి కళ్యాణం జరుగుతుంది. రాత్రి 12 గంటల సమయంలో కళ్యాణం తంతు పూర్తికాగానే.. ఉత్సవ విగ్రహాలతో నెరినికి , నెరనికి తాండా, కొత్తపేట గ్రామాల భక్తులు జైత్రయాత్రగా బయల్దేరుతారు.
ఈ యాత్ర సింహగట్టం చేరుకోగానే.. సులువాయి, విరుపాపురం, ఎల్లార్తి , హరికేర, బిలేహల్, నెట్రవట్టి గ్రామాల ప్రజలు ఉత్సవ విగ్రహాల కోసం కర్రలతో వీరిపై తలపడతారు. రెండు వర్గాల మధ్య కర్రల సమరం జరుగుతుంది. ఇదే బన్ని ఉత్సవంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఇప్పుడీ బన్ని ఉత్సవం పాఠంగా చేరడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బన్నీ ఉత్సవం ప్రత్యేకత, సంప్రదాయాల గురించి భావితరాలకు కూడా తెలుస్తుందంటున్నారు.