నదిలో కొట్టుకుపోతోన్న ఏడేళ్ల బాలుడ్ని తమ ప్రాణాలు తెగించి.. ఇద్దరు యువకులు ప్రవాహంలోకి దూకి అతడ్ని ఒడ్డుకు చేర్చారు. అనంతరం ఆ బాలుడికి సీపీఆర్ చేసి ప్రాణం పోశారు. ఈ ఘటన కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఆదివారం చోటుచేసుకోగా.. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. గాసీ మొహల్లా సఫాకాదల్ సమీపంలో జీలం నదిలో 7 ఏళ్ల బాలుడు నీళ్ళల్లో కొట్టుకుపోతుండటం గమనించిన స్థానిక యువకులు జహూర్ అహ్మద్, షౌకత్ అహ్మద్ తక్షణమే స్పందించారు. ప్రవాహం ఎక్కువగా ఉన్న నదిలో దూకి బాలుడ్ని ఒడ్డుకు తీసుకొచ్చారు.
అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ఆ చిన్నారికి కార్డియోపల్మోనరీ రిససిటేషన్ ని అందించి ప్రాణాలు కాపాడారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. జహూర్ అహ్మద్ మాట్లాడుతూ... ‘నదిలో కొట్టుకుపోతున్న బాలుడ్ని ఒడ్డుకు చేర్చిన సమయంలో చనిపోయాడని మేము అనుకున్నాం.. కానీ, కొద్ది నిమిషాల పాటు సీపీఆర్ చేయడంతో ఊపిరి పీల్చుకున్నాడు.. ఆలస్యం చేయకుండా చికిత్స కోసం వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లాం.. వైద్యులు చికిత్స ప్రారంభించడంతో క్రమంగా కోలుకుంటున్నాడు.’ అని తెలిపారు.
వేడిని తట్టుకునేందుకు జీలం నదిలోకి బాలుడు దిగిన సమయంలో ప్రవాహ వేగానికి కొట్టుకుపోయినట్లు మొదట కనిపించిందని ఇద్దరూ పేర్కొన్నారు. ‘ ఆ సమయంలో మేము అక్కడ ఉండటం అతడు చాలా అదృష్టవంతుడు’ అని అన్నారు. అంతేకాదు, చిన్న పిల్లలను ఒంటరిగా కాల్వలు, చెరువులు, నదుల వద్దకు వెళ్లనీయవద్దని, అది చాలా ప్రమాదకరమని సూచించారు. ఇక, బాలుడ్ని రక్షిస్తున్న సమయంలో ఎవరో వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. వారిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చిన్నారి ప్రాణాలనే కాదు.. వారి కుటుంబం మొత్తాన్ని విషాదం నుంచి త్రుటిలో బయటపడేశారని కామెంట్ చేస్తున్నారు.