రాజ్‌కోట్‌లోని టీఆర్పీ గేమింగ్ జోన్ అగ్ని ప్రమాద ఘటనలో 9 మంది చిన్నారుల సహా 35 మంది సజీవదహనమయ్యారు. ఈ దుర్ఘటనపై తాజాగా గుజరాత్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. తాము రాష్ట్ర ప్రభుత్వాన్ని విశ్వసించలేమని వ్యాఖ్యానించింది. నగరంలో కనీసం రెండు నిర్మాణాలను ధ్రువీకరించడంలో రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్ విఫలమైందని హైకోర్టు నిప్పులు చెరిగింది. ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్‌లతో సహా ఎటువంటి అనుమతులు లేకుండా గత రెండేళ్లకుపైగా గేమింగ్ జోన్‌లు నిర్వహిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విశ్వసించలేమని పేర్కొంది. గేమింగ్ జోన్‌లు ఎటువంటి అనుమతి తీసుకోలేదని రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్ కోర్టుకు తెలియజేసింది.
దీనికి కోర్టు స్పందిస్తూ.. ‘ఇది రెండున్నరేళ్లుగా కొనసాగుతోంది.. మీరు కళ్లు మూసుకుని ఉన్నారని మేము భావించాలా? మీరు, మీ అనుచరులు ఏమి చేస్తారు?’ అని ఘాటైన వ్యాఖ్యానించింది. గేమింగ్ జోన్‌కు గతేడాది నవంబరులో స్థానిక పోలీసులు అనుమతించారని, 2024 డిసెంబరు 31 వరకూ దానిని పొడిగించారని రాజ్‌కోట్ మున్సిపల్ కమిషనర్ రాజు భార్గవ అన్నారు.
గేమింగ్ జోన్‌లో అధికారుల తనిఖీలు చేపట్టిన సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు చూసి విస్మయం వ్యక్తం చేసింది. ‘ఈ అధికారులు ఎవరు ఆడుకోవడానికి అక్కడికి వెళ్లారా?’ అని కోర్టు ప్రశ్నించింది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై కూడా విరుచుకుపడింది. ‘మీరు గుడ్డిగా వెళ్తున్నారు? మీరు నిద్రపోతున్నారా? ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని విశ్వసించలేం’ అని ఫైర్ సేఫ్టీ ధ్రువీకరణ విచారణలు నాలుగేళ్లుగా అపరిష్కృతంగా ఉన్నాయని చెప్పినప్పుడు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
గుజరాత్ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది మనీశ్ లవ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. అహ్మదాబాద్‌లోనూ అనుమతి లేకుండా రెండు గేమింగ్ జోన్‌లను నిర్వహిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణకు ప్రత్యేక బృందాన్ని నియమించి, 72 గంటల్లో నివేదిక అందజేయాలని సూచించినట్టు తెలిపారు. ఇందులో మాల్స్‌లోని మినీ-గేమింగ్ జోన్లు ఉన్నాయని, నగరంలో మొత్తం 34 జోన్‌లు ఉన్నాయని, వీటిలో మూడింటికి ఫైర్ సేఫ్టీ నుంచి ఎన్ఓసీ లేదని కోర్టుకు తెలిపారు.
అటువంటి సర్టిఫికేట్ లేకుండా గేమింగ్ జోన్ నిర్వహించలేరని పేర్కొన్నారు. దీనికి న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ రాజ్‌కోట్‌లో ఈ నియమాన్ని పాటించలేదు ఎందుకని ప్రశ్నించింది. ముగ్గుర్ని అరెస్టు చేశామని, మిగిలిన వారిని కస్టడీలోకి తీసుకునే ప్రక్రియ కొనసాగుతోంది లాయర్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా గతంలో జరిగిన అనేక సంఘటనలను ఎత్తిచూపిన కోర్టు.. ‘‘గత నాలుగేళ్లలో ఎన్నో నిర్ణయాలు, సూచనలు ఇచ్చాం.. ఆ తర్వాత కూడా రాష్ట్రంలో ఆరు ఘటనలు జరిగాయి.. ఇందులో ఐదు భారీ అగ్ని ప్రమాదాలు ఉన్నాయి’’ అని వ్యాఖ్యానించింది.