రఫాలో సైనిక చర్యలను తక్షణమే నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఇజ్రాయేల్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో భారతీయ న్యాయమూర్తి జస్టిస్ దల్వీర్ భండారీ ఒకరు. రఫాపై యుద్ధం వెంటనే నిలిపివేయాలని ఆయన తన తీర్పులో రాశారు. దక్షిణాఫ్రికా దాఖలు చేసిన కేసులో విచారణ చేపట్టిన ఇంటర్నేషనల్ కోర్టు ఆఫ్ జస్టిస్ (ఐసీజే).. శుక్రవారం ఈ తీర్పు వెల్లడించింది. జస్టిస్ దల్వీందర్ భండారీ.. 2012 నుంచి ఐసీజేలో న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో 1947లో జన్మించిన జస్టిస్ భండారీ.. పద్మ భూషణ్ సహా పలు అవార్దులను అందుకున్నారు.
సుప్రీంకోర్టులో అనేక చరిత్రాత్మక కేసులను వాదించిన ఆయన.. అక్టోబరు 28, 2005న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం, రాజ్యాంగ చట్టం, క్రిమినల్ చట్టం, సివిల్ ప్రొసీజర్, అడ్మినిస్ట్రేటివ్ లా, ఆర్బిట్రేషన్, ఫ్యామిలీ లా, కార్మిక, పారిశ్రామిక చట్టం, కార్పొరేట్ చట్టం వంటి కీలక అంశాలలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి తీర్పులు ఇచ్చారు. పదవీ విరమణ అనంతరం 2012లో ఐసీజేలో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రాదేశిక జల వివాదాలు, అంటార్కిటికాలో తిమింగలాల వేట, మారణహోమం, ఖండాలు పునర్వవస్థీకరణ, అణు నిరాయుధీకరణ, ఉగ్రవాదానికి నిధులు, సార్వభౌమ హక్కుల ఉల్లంఘన వంటి ఐసీజే ముఖ్యమైన కేసుల్లో కీలకంగా వ్యవహరించారు.
ఇంటర్నేషనల్ లా అసోసియేషన్ ఢిల్లీ సెంటర్‌కు అధ్యక్షుడిగా పనిచేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కావడానికి ముందు బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఓ విడాకుల కేసులో న్యాయమూర్తిగా ఆయన ఇచ్చిన తీర్పు హిందూ వివాహ చట్టం, 1955ను సవరించడానికి అవకాశం కల్పించింది. 150 ఏళ్ల చరిత్ర కలిగిన చికాగోలోని నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ లాలో 15 మంది అత్యంత విశిష్ట పూర్వ విద్యార్థులలో ఒకరిగా జస్టిస్ భండారీ గుర్తింపు పొందారు. ఆ యూనివర్సిటీ నుంచి 1971లో మాస్టర్ ఆఫ్ లా చేశారు.
కాగా, రఫాలోని పాలస్తీనా ప్రజల విధ్వంసానికి దారితీసే ఎటువంటి చర్యలనైనా ఇజ్రాయేల్ తప్పనిసరిగా నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం తన తీర్పులో స్పష్టం చేసింది. మొత్తం 15 మంది సభ్యులున్న ధర్మాసనంలో ఉగాండాకు చెందిన జూలియా సెబుటిండే, ఇజ్రాయెల్ హైకోర్టు మాజీ జడ్జి అహరోన్ బరాక్ మాత్రమే వ్యతిరేకించారు. కోర్టు నిర్ణయానికి 13-2 ఓట్లు మద్దతు లభించాయి. మానవతా సాయానికి ఎటువంటి అవరోధం కలిగించొద్దని సూచించింది. మారణహోమం ఆరోపణలపై దర్యాప్తు చేస్తోన్న ఐక్యరాజ్యసమితి సంస్థలకు సహకారం అందించాల్సిన అవసరాన్ని కూడా ఈ తీర్పు నొక్కి చెప్పింది.
అయితే, ఐసీజే ఆదేశాలను ఇజ్రాయేల్ తిరస్కరించింది. రఫాలో తాము అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా సైనిక ఆపరేషన్ చేపట్టామని ఇజ్రాయేల్ జాతీయ భద్రతా సలహాదారు త్జాచి హనెగ్బి, ఆ దేశ విదేశాంగ శాఖ పేర్కొన్నాయి. మరోవైపు, ఐసీజే తీర్పును ప్రశంసించిన ఐరాసలో పాలస్తీనా రాయబారి రియాద్ మన్సౌర్.. తక్షణమే అమలుచేయాలని అభ్యర్ధించారు.