డేరా సచ్ఛా సౌద చీఫ్ గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబాకు పంజాబ్ హరియాణా హైకోర్టులో భారీ ఊరట లభించింది. డేరా ఆశ్రమం మాజీ ఉద్యోగి హత్య కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. డేరా రాష్ట్రస్థాయి కమిటీ సభ్యుడు రంజిత్ సింగ్ 2002లో హత్యకు గురయ్యారు. ఈ హత్య వెనుక డేరా బాబా హస్తం ఉందనే ఆరోపణలు వచ్చాయి. హరియాణాలోని సిర్సాలోని డేరా హెడ్‌క్వార్టర్స్‌లో రామ్ రహీమ్.. మహిళలను ఎలా లైంగికంగా దోపిడీకి గురిచేస్తున్నాడో వివరించే గుర్తుతెలియని వ్యక్తి పేరుతో విడుదలైన లేఖ వెనుక రంజిత్ సింగ్ పాత్ర ఉందనే ప్రతీకారంతో ఆయన హత్య చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.
ఈ కేసును దర్యాప్తుచేపట్టిన సీబీఐ.. డేరా బాబా హస్తం ఉందని నిర్దారించింది. దీంతో డేరా బాబాను దోషిగా తేల్చిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. ఆయనకు యావజ్జీవిత శిక్ష ఖరారు చేసింది. గుర్తుతెలియని వ్యక్తి విడుదల చేసిన లేఖతో డేరా చీఫ్ బాధపడ్డారని, ఇతర నిందితులతో కలిసి రంజిత్ సింగ్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నారని అనుమానం లేకుండా రుజువయ్యిందని ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పును గుర్మీత్ రామ్ రహీమ్ హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. డేరా బాబాతో పాటు ఈ కేసులో మరో నలుగుర్ని నిర్దోషులుగా ప్రకటించింది.
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ రహీమ్.. ఆశ్రమంలో మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్టు అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పటికే ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం, జర్నలిస్ట్ రామ్ చందర్ ప్రజాపతి హత్య కేసులో డేరా బాబా దోషిగా నిర్దారణ అయ్యారు. సిర్సాలోని డేరా ఆశ్రమంలోని మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు, అకృత్యాలకు పాల్పడినట్టు 2014లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన ఈ ఘటనలపై సీబీఐ విచారణ చేపట్టింది. అయితే, తాను నపుంశకుడ్ని అంటూ డేరా బాబా చేసిన వాదనలను కోర్టు తిరస్కరించింది. 2017లో కోర్టు ఆయనను దోషిగా నిర్దారించడంతో ఆయన అనుచరులు హింసకు తెగబడ్డారు.
ఈ హింసాత్మక ఘటనల్లో 30 మంది ప్రాణాలు కోల్పోగా.. వందల మంది గాయపడ్డారు. పరిస్థితిని అదుపు చేయడానికి సైన్యం రంగంలోకి దిగాల్సి వచ్చింది. సాధ్వీలపై అత్యాచారం, జర్నలిస్ట్ హత్య కేసులో ప్రస్తుతం 20 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. తాజా తీర్పుపై గుర్మీత్ రామ్ లాయర్లు మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, డేరా చీఫ్‌కు న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు.