చంద్రబాబు ఎన్నికలలో అలజడులు సృష్టించారని వైయస్ఆర్‌సీపీ నాయకుడు, మంత్రి మేరుగు నాగార్జున విమర్శించారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సడలింపు నిబంధనలపై వైయస్ఆర్‌సీపీ నేతలు మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు పేర్నినాని, మద్దాలిగిరి, మాజి మంత్రి రావెల కిషోర్ బాబు, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తిలు ఎన్నికల కమీషన్ కు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ఓటర్లపై టిడిపి నేతలు దాడులు చేస్తే ఎన్నికల కమీషన్ చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఎన్నికల కమీషన్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుధ్దంగా ఏపి ఈసి ఆదేశాలు ఇచ్చిందన్నారు. నిబంధనలను పాతరేసినట్లుగా ఉంది. వెంటనే ఆ ఆదేశాలు ఉపసంహరించుకోవాలని డిమాండు చేశారు. కేవలం స్పెసిమన్ సంతకం ద్వారా ఆమోదించడం సరికాదని మంత్రి అన్నారు. పోలింగ్ రోజు అరాచకాలకు తెరలేపిన టిడిపి...వైయస్ఆర్‌సీపీ గెలుపు ఖాయం అనే భయంతో కౌంటింగ్ కూడా సక్రమంగా జరగకూడదని టిడిపి కుట్ర పన్నిందన్నారు.