ఆంధ్రప్రదేశ్‌లో వాహనదారులకు ముఖ్యమైన గమనిక.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై థర్డ్ పార్టీ బీమా లేకుండా నడిపే వాహనాలపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించారు.. ముమ్మరంగా తనిఖీలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా బీమా పత్రాలు లేని వాహనదారులపై కేసులు నమోదు చేయనున్నారు.. ఈ మేరకు రవాణా శాఖ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు.
కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ (మోర్త్) ఏప్రిల్ 2న కీలకమైన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రహదారి భద్రతలో భాగంగా.. ఇకపై వాహనాలకు తప్పనిసరిగా బీమా ఉండేలా చూడాలని ఆదేశించింది.. దీనికి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపింది. ప్రధానంగా థర్డ్ పార్టీ బీమా లేని వాహనాల వల్ల ఏవైనా ప్రమాదాలు జరిగితే.. ఈ ఘటనల్లో చనిపోయిన బాధితుల కుటుంబాలకు ఎటువంటి బీమా సాయం అందటం లేదట. అందుకే తప్పనిసరిగా వాహనాలకు బీమా ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు రావడంతో.. ఈ ఏడాది ఏప్రిల్ 3న రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా వాహనాలకు బీమాపై మోటారు వాహన ఇన్‌స్పెక్టర్ లు తరచుగా తనిఖీలు నిర్వహించేలా చూడాలని.. తాజాగా ఆర్‌జేటీసీలు, డీటీవోలకు కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. వాహనాల తనిఖీలతో పాటుగా.. వాహనదారులకు అవగాహన కల్పించాలని ఆదేశాల్లో ప్రస్తావించారు. బీమా లేకుండా పట్టుబడిన వాహనదారుడికి.. మోటారు వాహన చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు. బీమా లేకుండా తొలిసారి పట్టుబడే వాహనదారుడికి 3 నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.2 వేల జరిమానా విధిస్తారు. ఒక్కోసారి జైలు శిక్ష, జరిమానా రెండూ విధించే అవకాశం ఉంటుంది. ఒకవేళ మళ్లీ దొరికిపోతే మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.4 వేల జరిమానా విధిస్తారు. రెండూ విధించే అవకాశం ఉందంటున్నారు అధికారులు.
ఇదిలా ఉంటే.. జూన్ 1 నుంచి అమలు చేయనున్న జరిమానాలపై ఏపీ లారీ యజమానుల సంఘం సీఎస్ జవహర్ రెడ్డిని కలిసింది. ఓవర్ స్పీడ్, లైసెన్స్ లేకుండా వాహనం నడపటం వంటి ఉల్లంఘనలకు విధించే జరిమానాలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఆపాలని కోరారు. లారీలకు ఎక్కువ ఎత్తులో లోడ్ ఉంటే గతంలో రూ.వెయ్యి జరిమానా ఉంటే.. ఇఫ్పుడు 20 వేలకు పెంచారని.. అలాగే ఓవర్ లోడ్‌కు రూ.2వేల జరిమానాను రూ.20వేలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. గ్రీన్ ట్యాక్స్‌ను రూ.25వేలకు పెంచడం సరికాదని.. కొత్తగా జరిమానాలు పెంచితే తాము ఆర్థికంగా ఇబ్బందుల ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.