ఎన్టీఆర్ జిల్లా, జగ్గయ్యపేట జాతీయ రహదారిపై పెనుగంచి ప్రోలు మండల పరిధిలో నవాబు పేట వద్ద బొగ్గులోడు లారీలో అనుమానాస్పద స్థితిలో ఇద్దరు మృతి చెందారు. అనకాపల్లి నుంచి జగ్గయ్యపేటకు లారీ బొగ్గు లోడుతో బయలుదేరింది. లారీ డ్రైవర్ కనగాల అప్పారావు (50) మిత్రులు ఇద్దరు ఆయనతోపాటు జగ్గయ్యపేటకు లారీలో వస్తున్నారు. గురువారం రాత్రి వైజాగ్ నుంచి లారీ బయలుదేరింది. అనకాపల్లిలో డ్రైవర్ కనగాల అప్పారావు స్నేహితులు నరసింహారావు (55), సత్యనారాయణ (63) లారీ ఎక్కారు. లారీ ఎక్కినప్పుడు నుంచి ఇద్దరూ మద్యం సేవిస్తున్నారని డ్రైవర్ చెబుతున్నాడు. శుక్రవారం సాయంత్రం నందిగామ దాటాక నీరసించి అపస్మారక స్థితిలోకి వెళ్లారని డ్రైవర్ కనగాల అప్పారావు చెబుతున్నాడు.నవాబుపేట వద్ద లారీ ఆపిన డ్రైవర్ కనగాల అప్పారావు అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న అంబులెన్స్ అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరినీ జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే వారు మృతి చెంది నట్లు డాక్టర్లు చెప్పారని డ్రైవర్ తెలిపాడు. దీంతో పెనుగంచిప్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లారీ డ్రైవర్ కనగాల అప్పారావు జగ్గయ్యపేట నుంచి సిమెంట్ లోడుతో వెళ్లి.. తిరిగి బొగ్గు లోడుతో వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతులలో నరసింహారావు ఎస్‌బీఐలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ సస్పెండ్ అయ్యాడు. మరో వ్యక్తి సత్యనారాయణ విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పనిచేసి రిటైర్ అయినట్లు సమాచారం. అతిగా మద్యం సేవించడం, డీహైడ్రేషన్, వడదెబ్బ కారణంగా మృతి చెందారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.