రాయలసీమ యూనివర్సిటీలోని కౌంటింగ్ హాలులో జూన్ 3న కౌంటింగ్ సిబ్బందికి ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని కర్నూలు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జి.సృజన సంబంధిత రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎన్నికల కౌంటింగ్ సన్నద్దతపై రిటర్నింగ్, నోడల్ అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కౌంటింగ్ సిబ్బందికి జూన్ 3న రాయలసీమ యూనివర్సిటీలోని కౌంటింగ్ హాలు వద్దకు తీసుకుని వెళ్లి రాజ కీయ పార్టీల అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహిం చే విధంగా చూసుకోవాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబందించిన కౌంటింగ్ రిజర్వు సిబ్బంది, లైబ్రరీ బ్లాకుల్లోని గ్రౌండు ఫ్లోర్‌లో కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. టెలి కాన్ఫరెన్స్‌లో పాణ్యం ఆర్వో, జేసీ నారపురెడ్డి మౌర్య, కర్నూలు ఆర్వో, నగర పాలక కమిషనర్ భార్గవ్‌తేజ పాల్గొన్నారు.